Telugu Global
Andhra Pradesh

జగన్‌కే అడ్వాంటేజా?

ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, ఇళ్ళ పట్టాలు, సంక్షేమ పథకాలపై చేసిన ఆరోపణలు, రాసిన కథనాలను, వేసిన కేసులను జగన్ ఇప్పటికే ఉదాహరణలుగా చెబుతున్నారు. ఈ జాబితాలో ఇళ్ళ నిర్మాణాలను కూడా చేరుస్తారు. అందుకనే ఇళ్ళు కట్టినా, కట్టకపోయినా జగన్‌కే అడ్వాంటేజ్ అనిపిస్తోంది.

జగన్‌కే అడ్వాంటేజా?
X

రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఇళ్ళు నిర్మించాలన్న ప్రభుత్వం ప్రయత్నానికి బ్రేకులుపడినట్లే. ఆర్ 5 జోన్లో ప్రభుత్వం 47 వేల మంది పేదలకు ఇళ్ళపట్టాలిచ్చింది. వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు నిర్మించాలని అనుకున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా టిడ్కో ఇళ్ళని మంజూరు చేయమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన నెలలోపే కేంద్రం ఆమోదించి ఇళ్ళను మంజూరు చేసింది. దీన్ని ప్రతిపక్షాలు ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది.

అప్పటినుండి పూర్తిగా వ్యతిరేక వార్తలు, కథనాలు ఇవ్వటం మొదలుపెట్టింది ఎల్లో మీడియా. ఇది సరిపోదన్నట్లు అమరావతి ప్రాంతంలోని కొంతమందితో టీడీపీ హైకోర్టులో కేసులు వేయించింది. కేసులను అడ్మిట్ చేసుకున్న హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 11వ తేదీ జరగే విచారణలో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. నోటీసుల్లో ఏముందంటే సుప్రీంకోర్టు పేదలకు ఇళ్ళ పట్టాలు మాత్రమే పంపిణీచేయమని చెప్పిందా? లేకపోతే ఇళ్ళు కూడా నిర్మించి ఇవ్వమని చెప్పిందా? అని అడిగింది.

హైకోర్టు నోటీసులు జారీచేయగానే టీడీపీ, ఎల్లో మీడియా పండగ చేసుకుంటున్నాయి. ఇళ్ళ నిర్మాణాలు ఆగిపోయినట్లే అని సంబరపడుతున్నాయి. అయితే వీళ్ళు మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే 47 వేల ఇళ్ళని నిర్మించినా జగన్మోహన్ రెడ్డికే అడ్వాంటేజ్. నిర్మించికపోయినా జగన్‌కే అడ్వాంటేజని. ఇళ్ళు నిర్మిస్తే ఒకేసారి వేలాది ఇళ్ళు నిర్మించిన క్రెడిట్ జగన్‌కు దక్కుతుంది. ఆ క్రెడిట్ దక్కకూడదని, రాజధాని నియోజకవర్గాలు తాడికొండ, మంగళగిరిలో వైసీపీ లబ్దిపొందకూడదనే టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నాలు.

వీళ్ళ కోరిక ప్రకారం జగన్ ఇళ్ళు కట్టలేకపోయారనే అనుకుందాం. రేపటి ఎన్నికల ప్రచారంలో తాను పేదలకు ఇళ్ళు నిర్మించి ఇద్దామని అనుకుంటే చంద్రబాబు, ఎల్లో మీడియా అడ్డుకున్నట్లు ఆరోపిస్తారు. చంద్రబాబు, ఎల్లో మీడియా పేదలకు వ్యతిరేకమంటారు. తన ఆరోపణలకు ఇళ్ళ నిర్మాణాలను అడ్డుకోవటమే నిదర్శనమంటారు. అప్పుడు చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని సమాధానం చెబుతుంది? ఎందుకంటే కేసులు వేయించింది చంద్రబాబు. ఇళ్ళ నిర్మాణాలకు వ్యతిరేకంగా వార్తలు రాసింది ఎల్లో మీడియానే. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు, ఇళ్ళ పట్టాలు, సంక్షేమ పథకాలపై చేసిన ఆరోపణలు, రాసిన కథనాలను వేసిన కేసులను జగన్ ఇప్పటికే ఉదాహరణలుగా చెబుతున్నారు. ఈ జాబితాలో ఇళ్ళ నిర్మాణాలను కూడా చేరుస్తారు. అందుకనే ఇళ్ళు కట్టినా, కట్టకపోయినా జగన్‌కే అడ్వాంటేజ్ అనిపిస్తోంది.

First Published:  7 July 2023 11:33 AM IST
Next Story