అండగా నిలిచిన వారిని అందలమెక్కించిన జగన్
ఏపీలో మొత్తం అధికార, నామినేటెడ్ పోస్టులన్నీ జగన్ రెడ్డి సామాజికవర్గానికే కట్టబెట్టారని తెలుగు దేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ మధ్య ముఖ్యమైన పదవులన్నింటిని ఇతర కులాల, మతాల వారికి కేటాస్తోంది. మరోవైపు వైసీపీ విధేయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కష్టపడి పనిచేస్తే పదవులు వరిస్తాయనే సంకేతం కూడా పార్టీ లీడర్లకి పంపుతున్నారు జగన్.
ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. లేవు రావు అంటూనే రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రధాన పార్టీలు కుల,మత,ప్రాంత ప్రయోజనాలతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీని టిడిపి సామాజికవర్గం కోణంలో కార్నర్ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం అధికారం, నామినేటెడ్ పోస్టులన్నీ జగన్ రెడ్డి సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపణలు గుప్పిస్తోంది. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తన సర్కారుపై రెడ్డి మార్క్ మరక చెరిపేయాలని జగన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో వస్తున్నారు. కొత్తగా నింపుతున్న పదవులలో రెడ్డి ఎవరూ లేకుండాచూసుకుంటున్నారు.
ఏపీ ఫిల్మ్ టీవీ ,థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు(ఇద్దరూ కమ్మ సామాజికవర్గమే)లని నియమించింది జగన్ సర్కార్. ముస్లిం మైనారిటీలకు చెందిన సినీనటుడు ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా, ఎస్వీబీసీ చైర్మన్ గా యాచేంద్ర (వెంకటగిరి జమీందారు)కి మరోసారి పదవిని పొడిగించారు. కాపు సామాజికవర్గానికి చెందిన పి విజయబాబుని ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమించి..తనపై వున్న రెడ్డి మార్క్ చెరిపేసుకునేందుకు ఒక్కో కులం, మతం, ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహించేలా పదవులు కేటాయిస్తున్నారు. మరోవైపు వైసీపీ విధేయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కష్టపడి పనిచేస్తే పదవులు వరిస్తాయనే సంకేతం కూడా పార్టీ లీడర్లకి పంపినట్టవుతుందని జగన్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది