3వారాలు టైమ్ ఇస్తా.. లేకపోతే..!
మూడు వారాలు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నానని, బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే తానే వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని హెచ్చరించారు జగన్.
అచ్యుతాపురం సెజ్ ఘటనలో గాయపడి, అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. వారెవరికీ నష్టపరిహారం అందలేదని ఆయన చెప్పారు. కాంపెన్సేషన్ అనేది మానవత్వంతో ఇవ్వాలని, ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. రెండు మూడు వారాలు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నానని, బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే తానే వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని హెచ్చరించారు జగన్.
ఆస్పత్రి లోపల బాధితుల్ని జగన్ పరామర్శించారు. ప్రతి బెడ్ వద్దకు వెళ్లి చికిత్సపొందుతున్నవారితో మాట్లాడారు, వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అండగా ఉంటామన్నారు. ఫ్యాక్టరీలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కూడా వాకబు చేశారు. ఫ్యాక్టరీలో అన్నీ సక్రమంగా ఉన్నాయని, తనిఖీలు కూడా సరిగానే జరుగుతాయని, కానీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలియడంలేదని బాధితులు తనతో చెప్పారని అన్నారు జగన్. ఫ్యాక్టరీ యాజమాన్యాలపై తాను విమర్శలు చేయడంలేదని, కానీ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ ప్రభుత్వానికి ప్రజల మీద ధ్యాస లేదని విమర్శించారు జగన్. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే ఆలోచన కూడా వారికి లేదన్నారు. ఎంత సేపు రెడ్ బుక్ బయటకు తీసి, వైరి వర్గాన్ని ఇబ్బంది పెట్టడమే వారు పనిగా పెట్టుకున్నారని చెప్పారు. ఇక బాధితుల్ని పరామర్శచేందుకు జగన్, ఆస్పత్రికి వెళ్లే క్రమంలో ఆయన కాన్వాయ్ విషయంలో కూడా గందరగోళం జరిగిందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఆయన కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారని, అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని చెప్పారు.