నాగబాబు తప్పు ఒప్పుకున్నట్లేనా..?
తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావు పేరుతో ఉన్న ఓటును రద్దు చేయించుకుని మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేపల్లిలో నాగేంద్రబాబు పేరుతో దరఖాస్తు చేసుకున్నట్లు బయటపడింది.
రెండు రాష్ట్రాల్లో ఓట్ల విషయంలో కక్కుర్తిపడిన విషయాన్ని కొణిదెల నాగబాబు అంగీకరించినట్లేనా..? తెలంగాణలో ఓట్లను రద్దుచేసుకుని ఏపీలోని మంగళగిరి నియోజకవర్గంలో ఓట్లు నమోదు చేయించుకునేందుకు నాగబాబు కుటుంబం ఫారమ్- 6 దాఖలు చేసిన విషయం బయటపడింది. రెండురోజులుగా ఈ విషయం సోషల్ మీడియా, మీడియాలో వచ్చినా.. నాగబాబు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. తనను తాను సమర్థించుకునేందుకు ఏదో పొంతనలేని సమాధానమిచ్చారు. సొంత రాష్ట్రంలో ఓటు వేసేందుకే తెలంగాణలో తమ కుటుంబం ఓటును రద్దు చేసుకున్నట్లు చెప్పారు.
తాను తప్పు చేసినట్లు నాగబాబు అంగీకరించినట్లుగానే అనుకోవాలి. ఎలాగంటే.. తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు వేయకుండా రద్దు చేసుకొనుంటే అప్పుడు నాగబాబు చెప్పింది నిజమవుతుంది. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబర్ 168 నాగబాబు, భార్య పద్మజ, కొడుకు వరుణ్ తేజ ఓట్లు వేశారు. పోలింగ్ అయిపోగానే తెలంగాణలో తమ ఓట్లను రద్దుచేసుకున్నారు. వెంటనే ఏపీలోని మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలోని పోలింగ్ బూత్ పరిధిలో ఓట్లు నమోదుకు డిసెంబర్ 4వ తేదీన ఫారమ్- 6తో దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే నాగబాబు కక్కుర్తి బయటపడింది.
తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావు పేరుతో ఉన్న ఓటును రద్దు చేయించుకుని మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేపల్లిలో నాగేంద్రబాబు పేరుతో దరఖాస్తు చేసుకున్నట్లు బయటపడింది. గుంటూరులోని రాధా రంగా నగర్‌లోని 5-263 ఇంటి అడ్రస్‌తో నాగబాబు కుటుంబం ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకుందట. పై ఇంటినెంబర్ జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ కుమార్‌దిగా అధికారులు గుర్తించారు. అలాగే ఇదే నెంబర్‌పై వచ్చిన 53 ఓట్ల దరఖాస్తులను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
నిజానికి తెలంగాణలో ఓటేసిన నాగబాబుకు ఏపీలో ఓటు ఉండకూడదు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇది నేరమనే చెప్పాలి. వైసీపీ దొంగఓట్లు నమోదు చేయిస్తోందని చంద్రబాబు నాయుడుతో కలిసి గోలచేస్తున్న పవన్ కల్యాణ్.. తన సోదరుడు నాగబాబు చేసిన నిర్వాకంపైన మాత్రం మాట్లాడటంలేదు. తాను చేసింది సబబే అని నాగబాబు అనుకుంటే ఏ విధంగా సబబో నిరూపించుకోవాలి. అలాకాకుండా నోటికొచ్చింది మాట్లాడి సమర్థించుకుంటున్నారంటేనే తానుచేసింది తప్పని నాగబాబుకు బాగా తెలుసని అర్థమవుతోంది.