స్పీకర్ పదవి ఉత్తరాంధ్రకే.. రేసులో ఆ సీనియర్!
కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. ఐతే స్పీకర్ పదవి ఇచ్చే ఉద్దేశంతోనే ఆయనను కేబినెట్‌లోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై స్పందించారు అయ్యన్న. పార్టీకి కొత్త రక్తం అవసరం ఉందని.. అందుకే జూనియర్లకు మంత్రి పదవులిచ్చారని చెప్పుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు ఉంటారన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్‌గా రోజుకో పేరు తెరపైకి వస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేరును స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో అయ్యన్న పాత్రుడు ఒకరు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న.. ఇప్పటివరకూ 7 సార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. గతంలో మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం కూడా అయ్యన్న సొంతం. ఇటీవలి ఎన్నికల్లోనూ నర్సీపట్నం నుంచి మంచి మెజార్టీతో విజయం సాధించారు. తాజా కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. ఐతే స్పీకర్ పదవి ఇచ్చే ఉద్దేశంతోనే ఆయనను కేబినెట్‌లోకి తీసుకోలేదని తెలుస్తోంది. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై స్పందించారు అయ్యన్న. పార్టీకి కొత్త రక్తం అవసరం ఉందని.. అందుకే జూనియర్లకు మంత్రి పదవులిచ్చారని చెప్పుకొచ్చారు.
ఇక స్పీకర్ పదవికి అయ్యన్నతో పాటు కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ నెల 18న తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. అనంతరం 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. మరోవైపు స్పీకర్ పదవిపై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూడా ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే తాను స్పీకర్‌ను అవుతానంటూ ఎన్నికలకు ముందే స్వయంగా ప్రకటించుకున్నారు RRR. ఐతే ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడమే ఎక్కువని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.