Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు భారీ షాక్‌.. ఐటీ నోటీసులు

2019 జనవరిలో స్వయంగా చంద్రబాబే షాపూర్‌ జీ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవాల్సిందిగా ఆదేశించినట్టు చెబుతున్నారు.

చంద్రబాబుకు భారీ షాక్‌.. ఐటీ నోటీసులు
X

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని హిందుస్థాన్‌ టైమ్స్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇన్‌ఫ్రా కంపెనీల సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు అందినట్టు ఐటీ గుర్తించింది. ఈ నోటీసులపై చంద్రబాబు లేవనెత్తిన అభ్యంతరాలనూ ఐటీ శాఖ తోసి పుచ్చింది. ముడుపులకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు స్పష్టం చేసింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు కాంట్రాక్టు పనులు చేసిన షాపూర్‌ జీ పల్లోంజి, ఎల్‌ అండ్ టీ సంస్థల నుంచి భారీగా ముడుపులు అందినట్టు గుర్తించారు. బోగస్‌ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్టు షాపూర్‌ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ ఐటీ విచారణలో అంగీకరించారు. ఆ మేరకు వాంగ్మూలం ఇచ్చారు.

2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ పల్లోంజీ సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌తో టచ్‌లోకి వెళ్లారు. పీఏ శ్రీనివాస్‌ ద్వారానే చంద్రబాబుకు బోగస్ సబ్‌ కాంట్రాక్టు సంస్థల ద్వారా ముడుపులు అందినట్టు ఐటీ గుర్తించింది. ఇన్‌ఫ్రా కంపెనీల నుంచి వచ్చిన రూ.118 కోట్లను బయటకు చెప్పని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదు, చట్ట ప్రకారం ఎందుకు మీపై చర్యలు తీసుకోకూడదు అంటూ ఐటీ జారీ చేసిన షోకాజ్‌ నోటీసులను చంద్రబాబు తిరస్కరించినట్టు హిందూస్థాన్‌ టైమ్స్‌ కథనం చెబుతోంది. దాంతో ఆగస్ట్ 4న హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం నుంచి సెక్షన్ 153సీ కింద మరోసారి నోటీసు జారీ అయ్యాయి.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలోని సచివాలయం, అసెంబ్లీ, కోర్టు భవన నిర్మాణాల్లో భారీగా వసూళ్లు జరిగాయన్నది ఆరోపణ. తన మనుషుల ద్వారా బోగస్‌ కంపెనీలను సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో ముడుపులు తీసుకున్నట్టు ఐటీ శాఖ గుర్తించింది. ముఖ్యంగా షాపూర్ జీ పల్లోంజి, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి సబ్‌ కాంట్రాక్టుల రూపంలో ముడుపులు అందాయి.

2019లో షాపూర్‌ జీ పల్లోంజి కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో సోదాలు చేయగా ఈ ముడుపులకు సంబంధించి ఆధారాలు లభించాయి. దాంతో 2020లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో తనకు లభించిన సమాచారం ఆధారంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు.

2019 జనవరిలో స్వయంగా చంద్రబాబే షాపూర్‌ జీ పల్లోంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవాల్సిందిగా ఆదేశించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8వేల కోట్ల విలువైన పనులను షాపూర్‌ జీ పల్లోంజి కంపెనీని అప్పగించారు. ఆ పనుల్లో ముడుపుల వసూలు కోసమే పీఏ శ్రీనివాస్‌ను చంద్రబాబు రంగంలోకి దింపినట్టు ఆరోపణ.

రంగంలోకి దిగిన పీఏ శ్రీనివాస్.. వినయ్, విక్కీ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను షాపూర్ జీ పల్లోంజి కంపెనీ ప్రతినిధి మనోజ్‌కు పరిచయం చేశారు. వినయ్‌, విక్కీ జైన్‌లు ఐదు బోగస్ కంపెనీలను సృష్టించగా.. వాటికి సబ్‌ కాంట్రాక్టర్లుగా నిధులు ఇవ్వాలని.. ఆ బోగస్ కంపెనీల నుంచి తాము నిధులు తీసుకుంటామని శ్రీనివాస్‌.. పల్లోంజి కంపెనీకి స్పష్టం చేసినట్టు ఆరోపణలు. ఎలాంటి పనులు చేయకుండానే బోగస్ కంపెనీల ద్వారా నిధులు స్వాహా చేసినట్టు అభియోగం. అయితే తొలుత షాపూర్‌ జీ పల్లోంజి కంపెనీ ఈ తరహాలో నిధులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. కావాలంటే పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పింది. దాంతో తాము చెప్పినట్టు ముడుపులు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ బెదిరించినట్టు మనోజ్‌ వాసుదేవ్‌ తన వాంగ్మూలంలో ఐటీ అధికారులకు వెల్లడించారు. అలా ఆ కంపెనీ నుంచి వచ్చిన ముడుపుల వ్యవహారాన్ని పీఏ శ్రీనివాస్‌ కూడా ఐటీ అధికారుల ముందు అంగీకరించారు. ఈ విషయాన్ని ఐటీ అప్రైజల్ రిపోర్టులో స్పష్టం చేశారు.

చంద్రబాబుకు దూబాయ్‌లో నేరుగా రూ. 15.14 కోట్లను దినార్లను క్యాష్‌ రూపంలో ఇచ్చినట్టు ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో షాపూర్ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ అంగీకరించారు. దాంతో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి.

*

First Published:  1 Sept 2023 11:12 AM IST
Next Story