మోడీ సూచనను పవన్ పక్కన పెట్టేశారా..!?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ప్రత్యేకించి సమావేశాలు, చర్చలు లేకపోయినప్పటికీ లోపాయికారిగా ఇరు పార్టీల మద్య అవగాహనతోనే ముందుకు సాగుతున్నారని చెప్పుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో జనసేనానికి టిడిపి కేడర్, నాయకులు అండదండలు అందిస్తున్నారని, ఇరు పార్టీల కార్యకర్తలు సయోద్యతోనే సాగుతున్నట్టు స్పష్టమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో విపక్షాల మధ్య పొత్తుల అంశం గందరగోళంగా మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానన్న జనసేన అధినేత పవన్ తన ప్రయత్నాలను ఎలా కొనసాగించగలరనే ఆసక్తి నెలకొంది. పొత్తులు, రాజకీయ భవిష్యత్తు పై ప్రధాని మోడీ సూచనలను జనసేనాని పట్టించుకోవడంలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మోడీతో విశాఖలో సమావేశం అయిన తర్వాత పవన్ లో దూకుడు తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టిడిపితో పొత్తు అంశంలో తొందరపడొద్దని, ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పవన్ కు మోడీ సూచించారనే వార్తలు వచ్చాయి. ప్రధాని సూచన మేరకే ఆయన సొంతంగా బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నారనేవారు కూడా లేకపోలేదు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రదాని సూచనను పవన్ పాటిస్తున్నట్టు లేదంటున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ప్రత్యేకించి సమావేశాలు, చర్చలు లేకపోయినప్పటికీ లోపాయికారిగా ఇరు పార్టీల మద్య అవగాహనతోనే ముందుకు సాగుతున్నారని చెప్పుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో జనసేనానికి టిడిపి కేడర్, నాయకులు అండదండలు అందిస్తున్నారని, ఇరు పార్టీల కార్యకర్తలు సయోద్యతోనే సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో చేపట్టబోయే కార్యక్రమాలకు టిడిపి శ్రేణులు తమ వంతు సహాకారం అందించేందుకు సిద్ధమవడం ఇందుకు నిదర్శనం.
క్షేత్ర స్థాయిలో టిడిపితోనే సఖ్యత
మిత్రపక్షమైన బీజేపీతో కంటే టీడీపీతో కలిసి పనిచేసేందుకే జనసైనికులు మొగ్గు చూపుతున్నారు. ఈసారి అధికారంలోనూ పవన్ కు భాగమిస్తానన్న సంకేతాల్ని చంద్రబాబు ఇప్పటికే పంపడంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. పైకి పొత్తు లేకపోయినా అంతర్గతంగా మాత్రం ఇరు పార్టీల నేతలు కలిసి పనిచేస్తుూనే ఉన్నారు. ఇప్పటికే స్ధానిక ఎన్నికల్లో పలు చోట్ల అధికారం పంచుకున్న టీడీపీ-జనసేన మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సహకరించుకునేందుకు సిద్దమవుతున్నారు.
పైగా బిజెపితో కలిస్తే కొన్ని వర్గాలు దూరమవుతాయేమోననే భయం కూడా జనసేనలో ఉంది. కేడర్ పరంగా బి.జెపితో కంటే టిడిపితో ఉంటేనే లాభం ఉంటుందని జనసేన నేతలతో పాటు కార్యకర్తలు కూడా భావిస్తున్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో కలిసే పనిచేసుకుంటున్నారు.
ముందునుంచీ రోడ్ మ్యాప్ ఇవ్వండంటూ బీజేపీ నాయకులను పవన్ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఆయన విసిగి తెగదెంపులు చేసుకునే వరకూ వచ్చారు. దీంతో మోడీతో భేటీ అయ్యే అవకాశం లభించడం, ఆయన రోడ్ మ్యాప్ లాంటి సూచనలు చేయడం జరిగింది. కానీ జనసేన వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నది . అందుకే పవన్ కల్యాణ్ మాత్రం ప్రదాని సూచనను ఆచరిస్తున్నట్టు ఒంటరిగా సాగుతున్నట్టు పైకి కనబడుతున్నా కేడర్ మాత్రం టిడిపి శ్రేణులతో అంటకాగుతున్నారు. ఈ విషయంలో మిత్రపక్షమైన బిజెపి కేడర్ ను కానీ నేతలను కానీ కలుపుకుని పోతున్న దాఖలాలు ఎక్కడా కనబడడంలేదు. దీంతో సహజంగానే పవన్ తో పొత్తున్నట్లు చెప్పుకుంటున్న బీజేపీ ఒంటరవుతోంది.
బాబు-పవన్ బంధానికి బిజెపి అడ్డు చక్రం..
తెలుగుదేశం పార్టీకి జనసేన దగ్గరవుతున్న ఈ పరిణామాల నేపథ్యంలోనే బిజెపి చతురతను ప్రదర్శిస్తోంది. ఈ రెండు పార్టీలను దూరం చేయాలంటే ముందుగా టిడిపి ని దెబ్బతీయాలి. అదీ తెలంగాణలో రానున్న ఎన్నికల అవసరాల దృష్ట్యా నేరుగా కాకుండా పరోక్షంగా దెబ్బకొట్టేందుకు ఆపార్టీ సన్నిహితులపై ఈడీ, సిబిఐ దాడులకు ప్లాన్ చేసిందంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిపై దాడులు అని ప్రచారం జరుగుతోంది. అంతేగాక, ఎప్పుడో టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ కార్పోరేషన్ స్కాంపైనా ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసినా ఈడీ దర్యాప్తు చేస్తుండటం కూడా బిజెపి వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. టీడీపీ హయాం స్కాంలు, ఆ పార్టీకి అండగా నిలుస్తున్న వారిని టార్గెట్ చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్నిదాడులు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు.