ఇక్కడ వైసీపీ గెలుపు గ్యారెంటీనా..?
వచ్చే ఎన్నికల్లో యనమల కుటుంబాన్ని కాదని ఎవరికైనా టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నా గట్టినేతే కనబడటంలేదట. నియోజకవర్గంలో చేయాల్సిన కంపు అంతా చేసేసిన యనమల తునిలో కాకపోతే ప్రత్తిపాడు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారని సమాచారం.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు చంద్రబాబునాయుడు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనితీరు బాగోలేని నాయకులను హెచ్చరిస్తున్నారు, అవసరమైతే మందలిస్తున్నారు కూడా. చివరకు ఏమవుతుందో తెలీదుకానీ ప్రతి నియోజకవర్గాన్నీ ప్రత్యేక యూనిట్ గా చూస్తున్నారు ఇద్దరు. ఇందులో భాగంగానే ఒక నియోజకవర్గంలో వైసీపీ గెలుపు గ్యారెంటీ అనేట్లుగా ఉంది వాతావరణం.
ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదయ్యా అంటే తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం. తుని అంటేనే యనమల రామకృష్ణుడు అన్నట్లుగా ఉంది పార్టీలో. అయితే రామకృష్ణుడు వైభవం చరిత్రలో కలిసిపోయింది. గడచిన మూడు ఎన్నికల్లో వరుసగా యనమల ఫ్యామిలీ ఓడిపోతోంది. 15 ఏళ్ళుగా టీడీపీ వరుసగా ఓడిపోతున్న కారణంగా పార్టీ బాగా బలహీనపడిపోయింది. దీనికి కారణం అచ్చంగా రామకృష్ణుడే అనటంలో సందేహంలేదు.
2009 ఎన్నికల్లో రామకృష్ణుడు ఓడిపోతే తర్వాత రెండు ఎన్నికల్లో ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని యనమల పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే పార్టీ నేతల మాటేమిటంటే యనమల కుటుంబం కాదు టీడీపీలో ఎవరికి టికెటిచ్చినా పార్టీ ఓడిపోవటం ఖాయమట. ఎందుకంటే తమ కుటుంబం తప్ప ఇంకెవరు పార్టీలో ఎదగకూడదన్న ఉద్దేశ్యంతో రెండోనేతను యనమల ఎదగనీయలేదు. చంద్రబాబుకు అన్నీ తెలిసినా ఏమీ చేయలేకపోయారు.
వచ్చే ఎన్నికల్లో యనమల కుటుంబాన్ని కాదని ఎవరికైనా టికెట్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నా గట్టినేతే కనబడటంలేదట. నియోజకవర్గంలో చేయాల్సిన కంపు అంతా చేసేసిన యనమల తునిలో కాకపోతే ప్రత్తిపాడు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారని సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇక్కడినుండి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు. కాపుల్లో రాజాకు మంచి పట్టుండటంతో పాటు ప్రజల నేతగా పేరుంది. కాబట్టి ప్రత్యర్థి ఎవరైనా రాజా గెలుపు దాదాపు ఖాయమనే మాట వినబడుతోంది.