పవన్‌కు పోటీగా ముద్రగడ.. పావులు కదుపుతున్న వైసీపీ?
పవన్‌కల్యాణ్‌కు పోటీగా కాపు సామాజికవర్గ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ నుంచి ఒకరిని పోటీ దించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే జనసేనాని పవన్‌కల్యాణ్‌కు గట్టి షాకివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో భారీగా కాపు సామాజికవర్గం ఓట్లు ఉండడంతో ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు పవన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌కు పోటీగా కాపు సామాజికవర్గ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ నుంచి ఒకరిని పోటీ దించాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్‌కల్యాణ్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ముద్రగడ. టీడీపీతో పవన్‌కల్యాణ్ పొత్తు ముద్రగడకు ఇష్టం లేకపోయినప్పటికీ.. సామాజికవర్గం కారణంగా పవన్‌కల్యాణ్‌కు మద్దతిచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీట్ల పంపకాలు, చంద్రబాబు చెప్పిన దానికి తల ఊపడం, తన ఇంటికి వస్తానని పలుమార్లు చెప్పి మాట తప్పడంతో పవన్ పట్ల విసుగెత్తిపోయారు ముద్రగడ. ఈ అంశాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పవన్‌కు ఘాటు లేఖ రాశారు.
మొదట్లో ముద్రగడ వైసీపీలోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ, మధ్యలో జనసేన నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించడంతో ఆగిపోయారు. కానీ, జనసేనాని తీరుతో ఆయన మళ్లీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పిఠాపురం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఇప్పటికే కాకినాడ ఎంపీ వంగా గీతను వైసీపీ ప్రకటించింది. కాగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ ముద్రగడను పోటీలో దించి పవన్‌కు చెక్ పెట్టాలనేది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.