బాలినేని విషయంలో జరిగిందిదేనా..?
బాలినేని వైఖరి కారణంగానే ఒంగోలు ఎంపీ టికెట్ పై జగన్ ఎలాంటి ప్రకటన చేయలేకపోయారు. మాగుంటకు టికెట్ ఇవ్వకపోతే తాను కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీచేసేది లేదని ప్రకటించారు.
సడన్‌గా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఇన్నిరోజులు ఒంగోలు ఎంపీ టికెట్ ను ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికే మళ్ళీ ఇప్పించాలని విశ్వప్రయత్నాలు చేశారు. బాలినేని ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంపీ టికెట్ మాగుంటకు కుదరదని చెబుతూనే ఉన్నారు. మాగుంట ప్లేసులో ఎవరినైనా చూస్తామని, లేకపోతే ఎవరిపేరునైనా సూచించమని బాలినేనినే అడిగారు. పార్టీ చెప్పిన పేర్లను ఒప్పుకోలేదు తాను ఇంకొకళ్ళ పేరును సూచించనని చెప్పారు.
బాలినేని వైఖరి కారణంగానే ఒంగోలు ఎంపీ టికెట్ పై జగన్ ఎలాంటి ప్రకటన చేయలేకపోయారు. మాగుంటకు టికెట్ ఇవ్వకపోతే తాను కూడా ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీచేసేది లేదని ప్రకటించారు. మాగుంటకు టికెట్ ఇప్పించేందుకు బాలినేని అలిగారు, గొడవచేశారు చివరకు చాలా అతిచేశారు. ఏమిచేసినా మాజీమంత్రి మాట చెల్లుబాటు కాలేదు. దాంతో చివరకు బుధవారం జగన్ తో జరిగిన భేటీలో అన్నింటికీ ఒప్పుకుని బయటకు వచ్చేశారు. ఎంపీగా ఎవరిని పోటీచేయించినా తనకు అభ్యంతరం లేదని, ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన గెలుపును తాను చూసుకుంటానని ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. మాగుంటతో బాలినేనికి ఉన్న సంబంధంఏమిటో తెలీదు. మాగుంటకు జగన్ టికెట్ ఇవ్వరని తెలిసిన తర్వాత కూడా ఎందుకన్ని రోజులు మొండిపట్టు పట్టారో అర్థంకావటంలేదు. పార్టీలో అంతిమంగా జగన్ నిర్ణయమే ఫైనల్ కాని, తనది కాదని బాలినేనికి తెలీదా..? అంతపట్టుబట్టి చివరకు ఇన్నిరోజుల తర్వాత జగన్ నిర్ణయమే ఫైనల్ అని అంగీకరించారంటే ఏమిటర్థం..?
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మాగుంటతో పాటు బాలినేనిని కూడా వదులుకోవటానికి జగన్ సిద్ధపడ్డారట. పార్టీలో ఉంటే ఉండు లేకపోతే వెళ్లిపో.. అని జగన్ అనేంతదాకా విషయాన్ని బాలినేని లాగినట్లు టాక్ వినబడుతోంది. మాగుంటకు వైసీపీలో కాకపోతే టీడీపీలో టికెట్ దొరుకుతుంది. కానీ, బాలినేనికి టీడీపీలో టికెట్ దొరకదు మరో ప్రత్యామ్నాయంలేదు. అందుకనే అన్నీ ఆలోచించుకునే ఫైనల్ గా జగన్ నిర్ణయానికి అంగీకరించినట్లు సమాచారం. పైగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మిగిలిన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్యే అభ్యర్థులు తనకు మద్దతుగా నిలవలేదన్న మంట కూడా బాలినేనిలో కనబడుతోంది. అందుకని వేరేదారిలేక చివరకు తన దారి తాను చూసుకుని మాగుంట విషయంలో పట్టును వదిలేశారట.