తిరుమల ఘాట్ రోడ్లపై వరుస ప్రమాదాలు అందుకేనా?
కొద్ది నెలల క్రితం ఈ వేగ నియంత్రణ నిబంధనలను సడలించారు. అప్పటి నుంచి డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని గుర్తించారు. కొందరు డ్రైవర్లు ఓవర్ టేక్‌లు చేస్తూ ఇతర వాహనాలను ఇబ్బంది పెడుతున్నట్టు తేల్చారు.
ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లపై వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. దీంతో టీటీడీ, పోలీసులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల ఘాట్‌లో ప్రమాదాలకు వేగ నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడం కూడా ఒక కారణమని భావిస్తున్నారు. గతంలో అలిపిరి నుంచి తిరుమలకు ప్రయాణ కాలం 28 నిమిషాలు, తిరుమల నుంచి అలిపిరికి వచ్చే సమయం 40 నిమిషాలుగా ఉండాలన్న నిబంధనలు ఉండేవి. అంతకంటే వేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తే చర్యలు తీసుకునేవారు. జరిమానా విధించేవారు.
కొద్ది నెలల క్రితం ఈ వేగ నియంత్రణ నిబంధనలను సడలించారు. అప్పటి నుంచి డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని గుర్తించారు. కొందరు డ్రైవర్లు ఓవర్ టేక్‌లు చేస్తూ ఇతర వాహనాలను ఇబ్బంది పెడుతున్నట్టు తేల్చారు. దాంతో తిరిగి వేగ నియంత్రణ చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈనెల 14న రెండు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు చనిపోయారు. సోమవారం నాలుగు ప్రమాదాలు జరిగాయి. పలువురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి కూడా ఘాట్‌లో ఒక ప్రమాదం జరిగింది. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రమాదాలు పెరగడానికి కారణాలను గుర్తించి వాటి కట్టడికి చర్యలు ప్రారంభించారు. పాత వాహనాలను ఇకపై కొండ మీదకు అనుమతించకూడదని నిర్ణయించారు. ఇటీవల వరుసగా ప్రమాదాలు జరగడానికి నిర్లక్ష్యం, అవగాహన లేమి, దూర ప్రయాణం కారణంగా డ్రైవర్లు అలసిపోవడం వంటి కారణాలు ఉన్నాయని ఏఎస్పీ వివరించారు. ఘాట్ రోడ్లపై వాహనాలు నడిపిన అనుభవం లేని వారు తిరుమలకు సొంత వాహనాలతో వెళ్లవద్దని కోరారు. కొందరు సొంత వాహనాలను ఘాట్ రోడ్లపై పక్కన ఆపి సెల్ఫీలు తీసుకుంటున్నారని ఇది మానుకోవాలని కోరారు.
ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్న టెంపో, తుపాను వాహనాలను తిరుమలకు అనుమతించే అంశంపైన అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇకపై భక్తుల సౌకర్యం కోసం ప్రీపెయిడ్ టాక్సీలను అందుబాటులో ఉంచే యోచన చేస్తున్నారు అధికారులు. ఘాట్ రోడ్లపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న మలుపులను గుర్తించి అక్కడ డ్రైవర్లను అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు.