Telugu Global
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదేనా? మళ్లీ అదే తంతు

30-40 సీట్ల వ్యాఖ్యలు వెనుక అసలు మర్మం.. కాపు నేతల్ని బుజ్జగించడం కోసమే అని తెలుస్తోంది. అన్ని సీట్లు తాను గెలిస్తే సీఎం అవ్వొచ్చని పవన్ కళ్యాణ్ పరోక్షంగా కాపు నేతలకి సంకేతాలిచ్చారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక అసలు మర్మం ఇదేనా? మళ్లీ అదే తంతు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పొత్తులపై దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మరోసారి స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు ఖాయమని కూడా సంకేతాలు ఇచ్చేశారు. అలానే సీఎం అభ్యర్థి కూడా తాను కాదని ఎన్నికలకి ముందే తేల్చాశారు.

వాస్తవానికి సీఎం అభ్యర్థితత్వం గురించి పవన్ కళ్యాణ్ ఇప్పుడే చెప్పాల్సిన పనిలేదు. కానీ.. గత కొన్ని రోజులుగా కాపు నేతల నుంచి క్షేత్రస్థాయిలో జనసేనానిపై ఒత్తిడి పెరుగుతోంది. సీఎం పదవి ఇస్తేనే ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని వాళ్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దాంతో తొలుత బీజేపీ వైపు అడుగులు వేసిన పవన్ కళ్యాణ్.. ఆ పార్టీతో పొత్తులో ఉన్నా సీఎం అయ్యే ఛాన్స్ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు తప్పనిసరి అయ్యింది. కానీ వచ్చే ఎన్నికల్లో కూడా తాను సీఎం పదవి కోసం డిమాండ్ చేయనంటూ పవన్ కళ్యాణ్ తేల్చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది జన సైనికులకి, కాపు నేతలకి రుచించని విషయమే.

2024 ఎన్నికల్లో ఒకవేళ టీడీపీ- జనసేన కలిపి అధికారంలోకి వచ్చినా చంద్రబాబు సీఎం సీటులో కూర్చోవడం ఖాయం. ప్రస్తుతం అధికార దాహంలో ఉన్న చంద్రబాబు అంత సులువుగా వేరొకరిని ముఖ్యమంత్రిని చేయరు. కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం పదవిని డిమాండ్ చేస్తూ పొత్తు కోరినా చంద్రబాబు అంగీకరించకపోవచ్చు. అదే జరిగితే అప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. కానీ అది పవన్ కళ్యాణ్‌కి ఇష్టం లేదు. దాంతో వైసీపీని ఓడించేందుకు జనసేనాని మరోసారి తన సీఎం కలని పక్కనపెట్టి టీడీపీతో జతకట్టబోతున్నారని తేలిపోయింది. ఇక 30-40 సీట్ల వ్యాఖ్యలు వెనుక అసలు మర్మం.. కాపు నేతల్ని బుజ్జగించడం కోసమే అని తెలుస్తోంది. అన్ని సీట్లు తాను గెలిస్తే సీఎం అవ్వొచ్చని పవన్ కళ్యాణ్ పరోక్షంగా కాపు నేతలకి సంకేతాలిచ్చారు.

కానీ కర్నాటక తరహా రాజకీయాలు ఏపీలో కష్టం. గత ఎన్నికలకి ముందు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేసిన చంద్రబాబు.. మంత్రి పదవుల్ని కూడా కట్టబెట్టారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను బాబు తెలివిగా టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఈ క్రమంలో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మ్యాజిక్ ఫిగర్‌కి సమీపంలో ఉంటే చంద్రబాబు ఊరుకుంటారా? అంటే సందేహమే!

First Published:  12 May 2023 9:44 AM IST
Next Story