పుట్టపర్తిలో లొల్లికి అసలు కారణమిదేనా..?
తమపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని.. పల్లె ఆరోపిస్తుండగా.. టీడీపీ దాడి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే పల్లె రఘునాథ్‌రెడ్డి హడావుడి వెనక వేరే కారణముందున్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో రాజకీయాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో నిత్యం ఆసక్తికరంగా మారుతోంది. నేతల అవినీతిపై దేవాలయాల వద్ద ప్రమాణాలు చేద్దామంటూ ఇప్పటికే అనేక నియోజవకర్గాల్లో ఇరువర్గాల లీడర్లు సవాళ్లు చేసుకుంటున్నారు. ఇక రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి ఈ కార్యక్రమాలను రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పుట్టపర్తిలోనూ ఇటువంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం.
నిజానికి పుట్టపుర్తిలో రాజకీయాలు ఎప్పుడూ కూల్ గానే ఉంటాయి. అక్కడి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పెద్దగా వివాదాలకు తావివ్వరు. రాజకీయపరమైన ఆరోపణలే తప్ప.. గొడవలకు వెళ్లరు. కానీ, లోకేశ్ పాదయాత్రతో పుట్టపర్తిలో వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిపరుడంటూ పల్లె ఆరోపించడం.. దీంతో ఇరువర్గాలు ప్రమాణాలకు సిద్ధమైన విషయం తెలిసిందే. వెరసి పుట్టపర్తి అట్టుడికింది.
తమపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని.. పల్లె ఆరోపిస్తుండగా.. టీడీపీ దాడి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే పల్లె రఘునాథ్‌రెడ్డి హడావుడి వెనక వేరే కారణముందున్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పల్లెకు టికెట్ డౌటే అన్న చర్చలు జరుగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పల్లెకు టికెట్ రాదని తన అనుచరుడు సైకం శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇప్పించుకుంటానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. దీంతో పుట్టపర్తిలో తన హవా నిరూపించుకొనేందుకే పల్లె రఘునాథ్ రెడ్డి హడావుడి చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. మరి గతంలో మంత్రిగా పనిచేసిన పల్లెను కూడా టీడీపీ అధిష్టానం పక్కకు పెడుతుందా..? జేసీ సిఫారసు మేరకు ఆయన అనుచరుడికే టికెట్ ఇస్తుందా..? అన్నది వేచి చూడాలి.