కుప్పంలో జగన్ అసలు ప్లాన్ ఇదేనా?
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును కుప్పం నియోజకవర్గంలో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన ప్రయత్నాలు ఫలించేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కూడా కదుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును కుప్పం నియోజకవర్గంలో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన ప్రయత్నాలు ఫలించేందుకు జగన్ వ్యూహాత్మకంగా పావులు కూడా కదుపుతున్నారు. రాజకీయంగానే కాకుండా ప్రభుత్వపరంగా కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సరే చంద్రబాబు ఓడిపోవాలని జగన్ అనుకున్నంత మాత్రాన అయిపోదు. జగన్ సంకల్పానికి జనాల మద్దతు కూడా ఉండాలి.
చంద్రబాబు ఓడుతారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే జగన్ ప్లాన్ వేరే వుందని అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటం అంత వీజీకాదని జగన్ కు కూడా బాగా తెలుసు. అయితే అసలు ప్లాన్ ఏమిటంటే వీలైనన్నిరోజులు చంద్రబాబును కుప్పం నియోజకవర్గంలోనే అట్టేపెట్టేయటం. పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు రాష్ట్రంలోని వీలైనన్ని నియోజకవర్గాల్లో తిరగాల్సుంటుంది. అనేకమంది అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేయాల్సుంటంది.
పార్టీ అధినేత ప్రచారానికి రాకపోవటం వల్లే తాము ఓడిపోయామనే మాట కొందరు అభ్యర్ధుల నోటివెంట వింటునే ఉంటారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబును ఫ్రీగా ప్రచారానికి తిరగనీయకుండా ముందరి కాళ్ళకు బంధాలు వేయటమే జగన్ అసలు ఉద్దేశ్యం అయుండచ్చు. తన గెలుపే అనుమానంలో పడినపుడు చంద్రబాబు ఇక ఇతర నియోజకవర్గాల్లో స్వేచ్చగా తిరగలేరు. బయట నియోజకవర్గాల్లో ఎంత తిరుగుతున్నా కుప్పంలో ఏమి జరుగుతోందో అనే టెన్షన్ పెరిగిపోతునే ఉంటుంది.
సరిగ్గా ఇదే జగన్ కు కావాల్సింది. ఎన్నికల సమయంలో చంద్రబాబును బాగా టెన్షన్ పెట్టేసి కుప్పంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడకూడా ఫ్రీగా ప్రచారం చేసే అవకాశం ఉండకూడదన్నదే జగన్ ప్లాన్. జగన్ ప్లాన్ వర్కవుటై కుప్పం జనాలు కూడా సానుకూలంగా స్పందిస్తే అప్పుడు చంద్రబాబు గెలుపు అనుమానంలో పడుతుంది. ఒకవేళ ఓడించటం సాధ్యం కాకపోయినా చివరివరకు టెన్షన్ అయితే తప్పదు. అందుకనే వ్యూహాత్మకంగా జగన్ లోకల్-నాన్ లోకల్, బీసీ-కమ్మ అనే కార్డులను ప్రయోగించారు. జగన్ ప్రయోగించిన రెండు కార్డులు వర్కవుటవుతాయా ? రిజల్టు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే తప్పదు.