Telugu Global
Andhra Pradesh

పవన్‌ ప్రాణాలకు ముప్పుందా..?

అసలు పవన్‌ ప్రాణాలకు ముప్పుందని నాదెండ్ల ఎలా చెప్పగలుగుతున్నారు..? పవన్‌ను హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..? పవన్‌ ఏమీ గొప్ప ప్రజాధరణ ఉన్న నేతేమీకాదు. వచ్చేఎన్నికల్లో పవన్‌ అధికారంలోకి రావటం ఖాయమని ఎవరు అనుకోవటంలేదు.

పవన్‌ ప్రాణాలకు ముప్పుందా..?
X

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రాణాలకు ముప్పుందా..? అవుననే అంటున్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌. అంటే డైరెక్టుగా ప్రాణాలకు ముప్పుందని చెప్పకుండా భద్రతకు ముప్పని చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్, విజయవాడ పవన్‌ ఎక్కడ తిరుగుతున్నా కొందరు గుర్తుతెలీని వ్యక్తులు ఫాలో అవుతున్నారట. హైదరాబాద్‌ లో ఇంటిముందు నాలుగురోజుల క్రితం రాత్రి నలుగురు యువకులకు, పవన్‌ భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న బౌన్సర్లకు మధ్య పెద్ద గొడవైందని చెప్పారు.

విశాఖపట్నం ఎయిర్‌ పోర్టులో గొడవ అయిన దగ్గరనుండి గుర్తుతెలీని వ్యక్తులు ఫాలో అవుతున్నట్లు నాదెండ్ల చెప్పారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు బౌన్సర్లలో ఒకళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే పవన్‌ భద్రతకు ముప్పన్న విషయాన్ని అక్కడితో ఆపకుండా ఇదంతా వైసీపీ నేతలపనే అని నాదెండ్ల ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది.

అసలు పవన్‌ ప్రాణాలకు ముప్పుందని నాదెండ్ల ఎలా చెప్పగలుగుతున్నారు..? పవన్‌ను హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..? పవన్‌ ఏమీ గొప్ప ప్రజాధరణ ఉన్న నేతేమీకాదు. వచ్చేఎన్నికల్లో పవన్‌ అధికారంలోకి రావటం ఖాయమని ఎవరు అనుకోవటంలేదు. మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారా.. లేదా అన్నది వదిలేస్తే అసలు పవన్‌ కే నమ్మకంలేదు. ఎందుకంటే జనసేన తరపున పోటీచేయటానికి పట్టుమని 10 మంది గట్టి నేతలు కూడా లేరు.

ఒకవేళ టీడీపీతో పొత్తుపెట్టుకుంటే మహాఅయితే ఓ 30–40 సీట్లలో పోటీచేస్తే అదే చాలాగొప్ప. పోటీచేసిన సీట్లలో జనసేన ఎన్ని గెలుస్తుందో కూడా ఎవరు చెప్పలేరు. ఇలాంటి పరిస్దితిలో పవన్‌ ప్రాణాలకు ముప్పుందని, దాడిజరిగే అవకాశాలున్నాయని నాదెండ్ల ఆందోళన వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది. బౌన్సర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు యువకులను గుర్తించి స్టేషన్‌ కు పిలిపించి విచారించి పంపేశారు. పవన్‌ ప్రాణాలకు ముప్పుందన్న నాదెండ్ల ఆరోపణలపై కాస్త ఆలోచించాల్సిందే.

First Published:  3 Nov 2022 6:00 AM IST
Next Story