ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోందా?
అధికారంలోకి రావటం కోసం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కుట్రలంటే జగన్ అంగీకరిస్తారా? ఒకరి తప్పులను మరొకరు అడ్వాంటేజ్‌గా తీసుకుని జనాల్లో చొచ్చుకుపోవటమే రాజకీయం.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని మంత్రి బొత్స సత్యానారాయణ చెప్పారు. వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు మంత్రికి కుట్రగా ఎలా కనిపిస్తోందో అర్ధం కావటంలేదు. రాజకీయమన్నాక ఎన్నికల్లో ఒక పార్టీని మరొక పార్టీ ఓడించేందుకే ప్రయత్నిస్తుంది కదా. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేనలు అనేక వ్యూహాలు పన్నటం చాలా సహజం. ఇంతమాత్రాన ఆ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బొత్సా అనటంలో అర్ధమేలేదు. అధికారం అందుకోవటమే టార్గెట్ అయినప్పుడు ఒక్కో పార్టీ ఒక్కో రకమైన వ్యూహాన్ని పన్నుతుంది.
2014-19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీని ఓడించేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు కూడా కుట్రగానే బొత్స ఒప్పుకుంటారా? ప్రత్యేక హోదా, రైల్వేజోన్ అంశంపై జగన్ పదేపదే చంద్రబాబునాయుడును కార్నర్ చేశారు. హోదా డిమాండ్‌తో తన ఎంపీలతో జగన్ రాజీనామాలు చేయించారు. హోదా సెంటిమెంటును సజీవంగా ఉంచేందుకు జగన్ ఎన్నో ఆందోళనలు చేశారు. రైతు రుణమాఫీ హామీ అమలులో ఫెయిలైన విషయాన్ని జగన్ పదేపదే ప్రస్తావించారు. కాపులను బీసీలుగా మార్చటంలో చంద్రబాబు ఫెయిల్యూర్‌ను జగన్ ఎన్నోసార్లు ప్రస్తావించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఫెయిలైన చంద్రబాబును జగన్ ఎన్నో వేదికల్లో ఎండగట్టారు. చివరకు పాదయాత్ర మొదలుపెట్టి చంద్రబాబును పదేపదే టార్గెట్ చేసిన విషయాన్ని బొత్సా మరచిపోయారేమో. అధికారంలోకి రావటం కోసం జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కుట్రలంటే జగన్ అంగీకరిస్తారా? ఒకరి తప్పులను మరొకరు అడ్వాంటేజ్‌గా తీసుకుని జనాల్లో చొచ్చుకుపోవటమే రాజకీయం.
ప్రతి పార్టీ కూడా ప్రత్యర్ధి పార్టీ చేసే తప్పులను వెయ్యి కళ్ళతో గమనించటం కుట్ర ఎలాగవుతుంది? ఇప్పుడు జగన్ ఫెయిల్యూర్లను జనాలకు వివరించి లబ్ది పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జగన్‌ను ఓడించేందుకు జనసేన, బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ కాకుండా జగన్ ప్రయత్నించటం కూడా ఒక వ్యూహమే. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, వ్యూహాలు రచించినా అంతిమంగా జనాల నమ్మకమే పార్టీలను గెలిపిస్తుంది. జనాలు ఎవరిని నమ్ముతారో ఆ పార్టీనే గెలిపిస్తారని సీనియర్ అయిన బొత్సాకు తెలీదా?