సీఎం జగన్‌కు రెండో కాన్వాయ్ రెడీ అయ్యిందా..? దేనికి సంకేతం..?
కొనుగోలు చేసిన వాహనాల్లో 9 వెహికల్స్ ను వైజాగ్ పంపబోతున్నట్లు సమాచారం. ఇందులో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఒక జామర్ వెహికల్ ఉంటుందట.
సీఎం జగన్మోహన్ రెడ్డికి రెండో కాన్వాయ్ రెడీ అయినట్లు సమాచారం. ఈమధ్యనే 19 టయోటా ఫార్చ్యూన్ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నాలుగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, రెండింటికి జామర్లుండగా.. మిగిలినవి మామూలు వెహికల్స్. ఇవన్నీ కూడా పూర్తిగా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ప్రభుత్వం కొత్తగా 19 వెహికల్స్ కొనటం, వీటిని రెండుగా డివైడ్ చేయటంతోనే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇంతకీ ఈ అనుమానాలు ఏమిటంటే.. కొనుగోలు చేసిన వాహనాల్లో 9 వెహికల్స్ ను వైజాగ్ పంపబోతున్నట్లు సమాచారం. ఇందులో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఒక జామర్ వెహికల్ ఉంటుందట. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించాలనుకుంటే ముందుగానే అక్కడికి బుల్లెట్ ప్రూఫ్+జామర్ వెహికల్స్ ను పంపుతున్నారు. ఇకనుండి మిగిలిన ప్రాంతాల్లో ఇదే పద్దతి కంటిన్యూ అయినా వైజాగ్ కేంద్రంగా ఉత్తరాంధ్రలో వాడకానికి ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్+జామర్ వెహికల్స్ కొన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి.
వైజాగ్ కేంద్రంగా ప్రత్యేకంగా కాన్వాయ్ వెహికల్స్ కొన్నారంటే తొందరలోనే జగన్ విశాఖపట్టణానికి వెళిపోతారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మంత్రులు ఇదే విషయమై మాట్లాడుతూ మూడు నెలల్లోగా జగన్ వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పరిపాలన మొదలుపెడతారని చెబుతున్నారు. మంత్రులు చెప్పిన మూడు నెలలంటే మార్చిలోగా అనుకోవాలి. అంటే బడ్జెట్ సెషన్స్ అయిపోగానే జగన్ తన క్యాంపాఫీసును విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా స్పీడుగా జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది.
ఆంధ్రా యూనివర్సిటీలోని మూడుభవనాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటున్నారని టాక్. అలాగే ఎండాడలో కూడా కొన్ని భవనాలు రెడీ అవుతున్నాయని, రుషికొండ ప్రాంతంలో కూడా క్యాంపాఫీసు రెడీ అవుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. మొత్తానికి పైన చెప్పిన ప్రాంతాల్లో ఏదో ఒకదానిలో క్యాంపు ఆఫీసు ప్రారంభం అవ్వటం ఖాయమని తెలుస్తోంది. క్యాంపు ఆఫీసు ప్రచారానికి ఇప్పుడు కొత్తగా కాన్వాయ్ రెడీచేయటం మరింత బలాన్నిస్తోంది. మరి ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.