వారికి ఓటమి ఇప్పుడే స్పష్టంగా కనబడుతోందా..!
అచ్చెన్నాయుడు బతిమాలుకునో.. నెత్తీనోరూ బాదుకునో.. కార్యక్రమాలు చేపట్టాలని కోరితే.. తప్పనిసరై అక్కడక్కడా మొక్కుబడిగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మాత్రమే ఉంది.
అవును.. 2024 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియాకి ఇప్పుడే టీడీపీ ఓటమి స్పష్టంగా కనబడుతున్నట్టుంది. అసలే జగన్‌ను ఓడించడం ఎలాగో అర్థంగాక తలలు బాదుకుంటున్న తరుణంలో.. చంద్రబాబు స్కిల్ స్కాంలో అరెస్టయి రిమాండుపై జైలులో ఉండటం వారికి మింగుడుపడని విషయంగా మారింది. ఈ పరిణామాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో సానుభూతి పొందాలనుకున్నా.. ఎవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు. అసలు టీడీపీ నాయకుల్లోనే రెండు రోజుల వరకూ ఎలాంటి స్పందనా కనిపించలేదు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు బతిమాలుకునో.. నెత్తీనోరూ బాదుకునో.. కార్యక్రమాలు చేపట్టాలని కోరితే.. తప్పనిసరై అక్కడక్కడా మొక్కుబడిగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి మాత్రమే ఉంది.
ఇక చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో సానుభూతి పెంచాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆయనకు మద్దతు వెల్లువలా వస్తోందని చూపించుకోవడానికి పడుతున్న ఆరాటమూ అంతా ఇంతా కాదు. ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని కోరుతూ రాష్ట్ర మంతటా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ‘చంద్రబాబు రాష్ట్ర సంపద.. ఆయన్ని కాపాడుకోవడం మన విధి..’ అంటూ స్లోగన్లతో వీటిని ఏర్పాటు చేయడం చూస్తే.. ప్రజల మద్దతు కోసం వారు పడుతున్న ఆరాటం.. వారి దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ఇక రాష్ట్రంలోనే కాకుండా.. హైదరాబాద్, బెంగళూరుతో పాటు విదేశాల్లోనూ కొంతమంది టీడీపీకి మద్దతిచ్చే ఐటీ ఉద్యోగులతో చేయించిన నిరసన కార్యక్రమాలు మరో ఉదాహరణ. వీటిని గమనించిన ఏ ఒక్కరూ ఇవి చంద్రబాబుపై సానుభూతితో చేపట్టిన కార్యక్రమాలు కాదని, కావాలని బతిమాలుకొని ఈ కార్యక్రమాలు చేయించారని తేలిగ్గానే అర్థమవుతోంది. ఈ నిరసనలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారిని బతిమాలుకున్నారని కూడా వార్తలు వచ్చిన విషయం, తద్వారా వారి పరువు బజారునపడ్డ విషయం తెలిసిందే.
వీటికితోడు చంద్రబాబు అరెస్టు అంశంపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించకపోవడంపై కొంతమంది నేతలు రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా కొందరు ఆక్రోశం, ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. బాబుకు మద్దతుగా ఒక్క ప్రకటన చేయాలని దేబిరిస్తున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటన్నింటికీ దూరంగా తన షూటింగ్‌లు, అవార్డు వేడుకలతో జూనియర్ ఎన్టీఆర్ తన పనుల్లో తాను నిమగ్నమై ఉన్నారు. తాజాగా ఆయన దుబాయ్ నుంచి తిరిగి రావడంతో ఇప్పుడైనా చంద్రబాబు అంశంపై ప్రకటన చేస్తాడని ఎదురుచూస్తుండటం, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం చూస్తే.. వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క సినిమా ఇండస్ట్రీలోనూ పెద్ద నటులు ఎవరూ చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు. అది కూడా టీడీపీ శ్రేణులకు కడుపుమంటగానే ఉంది. ఏదోకవిధంగా చంద్రబాబు అరెస్టు ఇష్యూకి సానుభూతి పెంచడం కోసం ఎల్లో మీడియా కూడా నిత్యం తమ వార్తల్లో ఈ అంశాలను హైలైట్ చేస్తుండటం చూస్తే.. వారికి టీడీపీ ఓటమి కళ్లముందు కనబడుతోందనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో కలుగుతోంది.
టీడీపీతోనే కలిసి వెళతానని పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో ప్రకటించినా.. అది అందరూ ముందునుంచీ ఊహిస్తున్న విషయమే. జనసేనను కలుపుకొని ఎన్నికలకు వెళ్లినా గట్టెక్కుతామనే గ్యారంటీ లేదని ఆ పార్టీ శ్రేణులకూ, నేతలకూ తెలుసు. బీజేపీని కూడా కలుపుకొనే ప్రయత్నం చేస్తున్నా.. అవి ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుకు అనుకూలంగానే ప్రకటనలు చేస్తున్నా.. బీజేపీ జాతీయ నాయకులు మాత్రం ఈ అంశంపై స్పందించడం లేదు. దీనినిబట్టి ఆ పార్టీ టీడీపీతో కలిసే ఉద్దేశంలో లేదని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మరిన్ని కుంభకోణాలపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం, సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తుండటం చూస్తే టీడీపీ నేతలకు, అనుకూల మీడియాకు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది.
*