Telugu Global
Andhra Pradesh

యార్ల‌గ‌డ్డ శిరీష భూమిపూజ‌ ఎల‌క్ష‌న్ డ్రామానా..?

ఓడిపోయినా శిరీష త‌న రాజ‌కీయ పంథా మార్చుకోలేదు. పోటీ చేసేది ప‌లాస‌లో అయితే, ఉండేది విశాఖ‌లో.. 200 కిలోమీట‌ర్ల దూరం నుంచి వ‌స్తూ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్న శిరీష ప‌ట్ల టిడిపిలోని ఓ వ‌ర్గం అసంతృప్తిగా ఉంది.

యార్ల‌గ‌డ్డ శిరీష భూమిపూజ‌ ఎల‌క్ష‌న్ డ్రామానా..?
X

త‌న తండ్రి ఏళ్లుగా ప‌ద‌వులు అనుభ‌వించి, ఆస్తులు కూడ‌గ‌ట్టుకున్న గ‌డ్డ‌పై ఆమెకు స‌డెన్‌గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది..? ఆస్తులు, ఇళ్లు అన్నీ నియోజ‌క‌వ‌ర్గానికి 200 కిలోమీట‌ర్ల దూరంలో పెట్టుకుని.. ఇక్క‌డ నుంచి పోటీ చేయాల్సి వ‌స్తుంద‌నే ఆలోచ‌న లేకుండా ఇన్నాళ్లూ అప్ అండ్ డౌన్ చేసిన సంగ‌తేంటి..? ఇప్పటికిప్పుడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాప‌న చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది..? అనే అనుమానాల‌కు స‌మాధానాలు కావాలంటే ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల‌పై దృష్టి సారించాలి.

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు గౌతు ల‌చ్చ‌న్న త‌న‌యుడు గౌతు శ్యాం సుంద‌ర్ శివాజీ తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత‌. మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే అనారోగ్య కార‌ణాలు, అల్లుడు యార్ల‌గ‌డ్డ వెంక‌న్న చౌద‌రి షాడోలా మార‌డం వ‌ల్ల రాజ‌కీయంగా తెర‌మ‌రుగు కావాల్సి వ‌చ్చింది. శివాజీ మంత్రిగా ఉన్న‌ప్పుడే వెంక‌న్న‌చౌద‌రి హ‌వా ఒక రేంజ్‌లో సాగేది. ఆయ‌నే అన్నీ చ‌క్క‌బెట్టేవాడు. గౌతు వార‌సుడిగా వెంక‌న్న చౌద‌రిని రాజ‌కీయాల్లోకి దింప‌లేక‌, కుమార్తె శిరీష‌ని ముందుంచి రాజ‌కీయం న‌డిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌లాస టిడిపి సీటు ద‌క్కించుకున్న శిరీష వైసీపీ అభ్య‌ర్థి సీదిరి అప్ప‌ల‌రాజు చేతిలో దారుణ ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఓడిపోయినా శిరీష త‌న రాజ‌కీయ పంథా మార్చుకోలేదు. పోటీ చేసేది ప‌లాస‌లో అయితే, ఉండేది విశాఖ‌లో.. 200 కిలోమీట‌ర్ల దూరం నుంచి వ‌స్తూ వీకెండ్ పాలిటిక్స్ చేస్తున్న శిరీష ప‌ట్ల టిడిపిలోని ఓ వ‌ర్గం అసంతృప్తిగా ఉంది. దీంతో సీటు రేసులో కొత్త పేర్లు ముందుకొచ్చాయి. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుని ఎదుర్కోవాలంటే వీకెండ్ ప‌ర్య‌ట‌న‌లు, అప్ అండ్ డౌన్ పాలిటిక్స్ ప‌నిచేయ‌వ‌ని టిడిపిలో వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఈ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు శిరీష కాశీబుగ్గలో తాత్కాలికంగా నివాసం ఉండేందుకు అద్దె ఇంటిని తీసుకున్నారు. ఇన్నాళ్లూ ప‌లాస గుర్తుకు రాలేదా అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అద్దెకి ఇల్లు కూడా ఇవ్వ‌కుండా వైసీపీ మంత్రి అడ్డుప‌డుతున్నార‌ని టిడిపి నేత‌లు ఆరోపిస్తున్నారు. అద్దె ఇంటి వివాదం రాజుకోవ‌డంతో శిరీష దంప‌తులు రూటు మార్చారు.

నియోజ‌క‌వ‌ర్గంలో సొంత ఇల్లు కూడా లేని టిడిపి అభ్య‌ర్థి అని ప‌దేప‌దే వైసీపీ నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. ఇల్లుతోపాటు టిడిపి కార్యాల‌యం కూడా క‌డ‌తామ‌ని చెబుతున్నారు. పలాస నియోజ‌క‌వ‌ర్గం శాసనం గ్రామం వద్ద పలాస నియోజకవర్గ టిడిపి కార్యాలయం, ఇంటి నిర్మాణానికి యార్ల‌గ‌డ్డ వెంక‌న్న చౌద‌రి, శిరీష దంప‌తులు భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి గౌతు శివాజీ దంప‌తులూ హాజ‌ర‌య్యారు. అయితే నిజంగానే ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఇక్క‌డే ఉంటారా..? ఎల‌క్ష‌న్ కోసం డ్రామానా అనేది తేలాల్సి ఉంది.

First Published:  4 March 2023 7:16 PM IST
Next Story