చంద్రబాబు-పవన్ సమస్య ఒకటేనా..?
తమకు బలంపెరిగింది కాబట్టి గౌరవప్రదమైన సీట్లివ్వాలని పవన్ అడుగుతున్నారు. మరి టీడీపీకి 2019 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం చొప్పున ఓట్లలొచ్చాయి. రాజధాని జిల్లాల్లో 41 శాతం చొప్పున ఓట్లొచ్చాయి.
రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పొత్తు అంత ఈజీగా కనబడటంలేదు. పొత్తుపెట్టుకోవటం రెండు పార్టీలకు అత్యవసరమనే విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలంటే రెండు పార్టీలు పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు, పవన్ ఇద్దరూ పదేపదే చెబుతున్నారు. ఇద్దరికీ పొత్తు అవసరమన్నపుడు సీట్లు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్ళాలి. అది సాధ్యమేనా..? వచ్చేఎన్నికల్లో పవన్ అడిగినన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా..?
తమతో పొత్తుపెట్టుకోవాలంటే గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందే అని పవన్ చాలాసార్లు చెప్పారే కానీ ఎన్ని సీట్లిస్తే గౌరప్రదంగా ఉంటుందో ఎప్పుడూ చెప్పలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే.. జనసేన ఏ జిల్లాల్లో అయితే ఎక్కువగా పోటీచేయాలని అనుకుంటోందో ఆ జిల్లాలపైనే టీడీపీ కూడా ఆశలుపెట్టుకుంది. జనసేన దృష్టంతా ఎక్కువగా ఉభయగోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలపైనే ఉంది. ఈ జిల్లాల్లోనే పోయిన ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఓట్లొచ్చాయి.
ఇదే సమయంలో టీడీపీకి కూడా పై జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లొచ్చాయి. కాబట్టి రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై జిల్లాల్లో అంత వీజీగా లెక్కలు తేలవు. ఎందుకంటే రెండుపార్టీలు కూడా పై నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబడతాయి. పవన్ లెక్కప్రకారం ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ఓటుబ్యాంకు 36 శాతముంది. ఇక కృష్ణా,గుంటూరు, విశాఖలో 25 శాతముందట. దీనికి ఆధారాలు ఏమీలేవు. ఏదో సర్వేలు చేయించుకున్నట్లున్నారు. అందుకనే పై లెక్కలు చెబుతున్నారు.
తమకు బలంపెరిగింది కాబట్టి గౌరవప్రదమైన సీట్లివ్వాలని పవన్ అడుగుతున్నారు. మరి టీడీపీకి 2019 ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం చొప్పున ఓట్లలొచ్చాయి. రాజధాని జిల్లాల్లో 41 శాతం చొప్పున ఓట్లొచ్చాయి. విశాఖ జిల్లాలో 37 శాతం ఓట్లొచ్చాయి. జనసేనకు ఇప్పుడు ఓటుబ్యాంకు పెరిగిందని చెబుతున్న శాతాలన్నీ టీడీపీకి ఆల్రెడీ 2019లోనే వచ్చేశాయి. కాబట్టి పై నాలుగు జిల్లాల్లో టీడీపీతో సమానంగా జనసేనకు సీట్లివ్వటానికి చంద్రబాబు అంగీకరిస్తారా.. అన్నదే సమస్య. ఇస్తే ఒకసమస్య, ఇవ్వకపోతే ఇంకో సమస్య. మరీ సమస్యను ఇద్దరూ పరిష్కరించుకుంటారో చూడాల్సిందే.