Telugu Global
Andhra Pradesh

పొత్తు ఖాయమైనట్లేనా..? త్రిముఖపోటీ తప్పదా..?

ఐదు పార్లమెంటు సీట్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవ్వటానికి సిద్ధమని చంద్రబాబు నుండి సమాచారం అందిందట. రాజమండ్రి, విజయవాడ, అరకు, నర్సాపురం, రాజంపేట లేదా హిందూపురం పార్లమెంటు సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం.

పొత్తు ఖాయమైనట్లేనా..? త్రిముఖపోటీ తప్పదా..?
X

రాబోయే ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఖాయమైనట్లే ఉంది. ఇప్పటికే జనసేనతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అదేమంతా సాఫీగా సాగటంలేదు. ఎందుకంటే పేరుకు బీజేపీ, జనసేన మిత్రపక్షాలు కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటలూ టీడీపీతోనే కలిసి వెళుతున్నారు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాల విషయంలో చంద్రబాబునాయుడుతోనే పవన్ చర్చలు జరుపుతున్నారు. కాబట్టి బీజేపీ, జనసేన పొత్తు పేరుకుమాత్రంగా మిగిలిపోయింది. అయితే బీజేపీతో పొత్తులేకుండా ఎన్నికలకు వెళ్ళటానికి చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే ఆ పార్టీని కూడా లాక్కునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతున్నట్లు కమలనాధులు చెబుతున్నారు. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్ళటానికి బీజేపీ అగ్రనేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. బుధవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఇదే విషయమై పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చూచాయగా ప్రస్తావించారట. ఈరోజు అంటే గురువారం జరగబోయే కోర్ కమిటి సమావేశంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు. పొత్తులో 10 పార్లమెంటు సీట్లు, 15 అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ తరఫున చంద్రబాబుకు ప్రతిపాదనలు వెళ్ళాయట.

అయితే ఐదు పార్లమెంటు సీట్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవ్వటానికి సిద్ధమని చంద్రబాబు నుండి సమాచారం అందిందట. రాజమండ్రి, విజయవాడ, అరకు, నర్సాపురం, రాజంపేట లేదా హిందూపురం పార్లమెంటు సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రాజమండ్రి నుండి పురందేశ్వరి, విజయవాడ నుండి సుజనా చౌదరి, నరసాపురం నుండి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు, అరకు నుండి కొత్తగీత, రాజంపేట ఇస్తే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేదా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని అంటున్నారు.

ఇక ఇచ్చే అసెంబ్లీ సీట్ల ఆధారంగా అభ్యర్థులుంటారని పార్టీలో టాక్ నడుస్తోంది. పార్టీలో టాక్ నిజమే అయితే టీడీపీ+జనసేన+బీజేపీ ఒక కూటమిగా, కాంగ్రెస్+కమ్యూనిస్టులు మరో కూటమిగా, వైసీపీ ఒంటరిగా మోహరించటం ఖాయమైనట్లే. ఈ కూటములు ఖాయమైతే ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరగటం ఖాయం.

First Published:  4 Jan 2024 11:15 AM IST
Next Story