మోడీ కష్టమంతా అదానీ కోసమేనా ?
బిడ్ల దాఖలకు ఈనెల 15వ తేదీ ఆఖరు. జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే బిడ్ లోని నిబంధనలు అదానీ గ్రూపునకు ఎక్కువ అడ్వాంటేజ్ గా ఉందట. సింగరేణి సంస్థ ద్వారా బిడ్ వేయించాలని కేసీఆర్ అనుకుంటున్నా సాంకేతికంగా ఇబ్బందులున్నట్లు సమాచారం.
ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మాత్రమే. స్టీల్ ఫ్యాక్టరీని వీలైనంత తొందరగా ప్రైవేటీకరణ చేసేయాలన్నది నరేంద్రమోడీ సంకల్పం. అందుకు అనుగుణంగానే కేంద్రప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇదే సమయంలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జరుగుతున్న ప్రయత్నాల్లో ఎలాంటి ప్రభావం కనబడటంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వ సంస్థను కేంద్రమే ప్రైవేటు వాళ్ళకి అమ్మేసుకుంటోంది. కాబట్టి ఇందులో రాష్ట్రప్రభుత్వం చేయగలిగింది దాదాపు ఏమీలేదనే చెప్పాలి.
అయితే కేంద్రం తలుచుకుంటే వైజాగ్ స్టీల్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించవచ్చు. సంస్థను ప్రైవేటువాళ్ళకి కాకుండా ప్రభుత్వానికి అప్పగించేయమని జగన్మోహన్ రెడ్డి చాలాకాలం క్రితమే నరేంద్రమోడీకి లేఖరాశారు. అయితే మోడీ సానుకూలంగా స్పందించలేదు. కారణం ఏమిటంటే.. ఈ సంస్థను ప్రైవేటుకు అందులోనూ అదానీ గ్రూపునకు కట్టబెట్టాలని మోడీ డిసైడ్ అయిపోయారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. స్టీల్స్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్న ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వాల నుంచి బిడ్లను ఆహ్వానించింది.
బిడ్ల దాఖలకు ఈనెల 15వ తేదీ ఆఖరు. జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే బిడ్ లోని నిబంధనలు అదానీ గ్రూపునకు ఎక్కువ అడ్వాంటేజ్ గా ఉందట. సింగరేణి సంస్థ ద్వారా బిడ్ వేయించాలని కేసీఆర్ అనుకుంటున్నా సాంకేతికంగా ఇబ్బందులున్నట్లు సమాచారం. ఇప్పటికే బిడ్లు దాఖలుచేసిన కంపెనీల్లో బీఎఫ్-3 నిర్వహణ ప్రకారం చూస్తే అర్హతలున్న కంపెనీలు చాలా తక్కువంటున్నారు. పైగా బిడ్డింగులో ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనేందుకు వీల్లేదని 2022లోనే కేంద్ర ఆర్థికశాఖ నిబంధన పెట్టింది. దీని ప్రకారం సింగరేణి కాలరీస్ కూడా బిడ్డింగులో పాల్గొనేందుకు లేదు.
సో, ఏ విధంగా చూసినా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అదానీ గ్రూపునకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు నిపుణులు, కార్మికసంఘాల నేతల ద్వారా తెలుస్తోంది. బిడ్డింగు ద్వారా ఫ్యాక్టరీని అదానీ గ్రూపు దక్కించుకుందని ప్రకటించేందుకు ఇప్పటికే అవసరమైన రంగమంతా రెడీ అయిపోయిందనే ప్రచారం ఊపందుకుంటోంది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా పరోక్షంగా అంగీకరించారు. అదానీ రాకతో స్టీల్ ఫ్యాక్టరీ ఖతమైనట్లే అని మండిపడ్డారు. లాభాలన్నీ దోస్తులకు నష్టాలు మాత్రం జాతికా అంటూ కేటీఆర్ ఫైరయ్యారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని అదానీ సొంతంచేసుకుని కొంతకాలానికి మూసేయటం ఖాయమని కేటీఆర్ ఆరోపించిన కారణమిదే.