Telugu Global
Andhra Pradesh

పొత్తు ధర్మం.. మాట్లాడే అర్హత ఉందా పవన్‌.!

పొత్తు ధర్మం గురించి పవన్‌కల్యాణ్ చేసిన కామెంట్స్‌ను సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జనసేన ప్రస్తుతం NDA కూటమిలో ఉంది.

పొత్తు ధర్మం.. మాట్లాడే అర్హత ఉందా పవన్‌.!
X

ఏపీలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుంటే..ప్రతిపక్షంలోని జనసేన-టీడీపీ కూటమి లెక్కలు తప్పుతున్నాయి. తాజాగా చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడం లేదంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అసలు చంద్రబాబు పొత్తు ధర్మం పాటిస్తే వార్త కానీ.. పాటించకుంటే గొప్పం విషయమేం కాదు. చంద్రబాబు చరిత్ర తెలిసినవాళ్లకి ఆ విషయం కొత్త కాదు. ఇక చంద్రబాబుపై ఉన్నట్లే తనపై కూడా ఒత్తిడి ఉందంటూ రాజానగరం, రాజోలులో జనసేన పోటీ చేస్తుందని ఏకపక్షంగా ప్రకటించారు పవన్‌. అంటే ఈ రెండు సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీతో పవన్‌కల్యాణ్‌ చర్చించలేదనే అనుకోవాలి.

ఇప్పుడు పొత్తు ధర్మం గురించి పవన్‌కల్యాణ్ చేసిన కామెంట్స్‌ను సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జనసేన ప్రస్తుతం NDA కూటమిలో ఉంది. బీజేపీతో పొత్తు కొనసాగుతోందని పవన్‌కల్యాణే గతంలో చెప్పారు.. ఇప్పుడు చెప్తున్నారు కూడా. జనసేన తమతోనే ఉందని బీజేపీ కూడా చెప్తోంది. NDA కూటమిలోని ఇతర పార్టీలకు ఇచ్చినట్లే పవన్‌కు గౌరవం ఇస్తున్నారు కమలనాథులు. అయితే బీజేపీతో పొత్తులో ఉంటూనే..ఆ పార్టీతో మాట మాత్రం చర్చించకుండా తెలుగుదేశంతో పొత్తు ప్రకటించేశారు జనసేనాని. దీనిపైనే సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. ఇది ఎలాంటి పొత్తు ధర్మమో పవన్‌కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉండి.. రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన అరగంటలోనే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీతో విడిపోలేదని ఓ వైపు చెప్తూనే ఆ పార్టీతో ఏనాడూ ఎలాంటి నిరసన, ఆందోళన కార్యక్రమంలో పాల్గొనలేదు పవన్‌కల్యాణ్‌. ప్రధాని మోడీ, అమిత్ షా లాంటి బడా నేతలు సైతం పవన్‌కల్యాణ్‌కు సముచిత గౌరవం ఇచ్చారు. కానీ తనకు చంద్రబాబు అవసర రీత్యా మాత్రమే గౌరవిస్తున్నాడన్న విషయం తెలిసినప్పటికీ.. ఏ మొహమాటం లేకుండా ఆయనతో వేదికలు పంచుకుంటున్నారు జనసేనాని. దీంతో పవన్‌కల్యాణ్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి.. ఏపీలో తెలుగుదేశంతో సీట్ల గురించి చర్చించడం ఎలాంటి పొత్తు ధర్మమో పవన్‌కల్యాణ్ చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

First Published:  26 Jan 2024 5:51 PM IST
Next Story