చంద్రబాబును పవన్ కల్యాణ్ ముంచుతున్నాడా..?
టీడీపీతో పొత్తు కోసం బీజేపీ ఆగ్రనేతలను ఒప్పించడానికి తాను చెమటోడ్చాల్సి వచ్చిందని, బీజేపీ నేతలను దండం పెట్టి వేడుకన్నానని, వారితో చీవాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ అనడం కూడా టీడీపీ వర్గాలకు మింగుడుపడడం లేదు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముంచుతున్నట్లే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతగా బలం లేని పవన్ కల్యాణ్ ఆడిస్తుంటే చంద్రబాబు ఆడుతున్నారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కల్యాణ్ చంద్రబాబును అడిగారో, చంద్రబాబే అనివార్య కారణాల వల్ల బీజేపీతో పొత్తు కోసం పవన్ కల్యాణ్‌ను ఆశ్రయించారో తెలియదు గానీ, మొత్తంగా ఈ వ్యవహారంలో తమ పార్టీ నష్టపోతోందనే అభిప్రాయం టీడీపీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.
పవన్ కల్యాణ్ చెప్పినట్టల్లా చంద్రబాబు ఆడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తమతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీ గెలుస్తుందని పవన్ కల్యాణ్ అనడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పట్టుమని ఒక్క ఎమ్యెల్యే కూడా లేని పవన్ కల్యాణ్ తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ కూడా గెలిచే పరిస్థితి లేదని మండిపడుతున్నారు.
పైగా, టీడీపీతో పొత్తు కోసం బీజేపీ ఆగ్రనేతలను ఒప్పించడానికి తాను చెమటోడ్చాల్సి వచ్చిందని, బీజేపీ నేతలను దండం పెట్టి వేడుకన్నానని, వారితో చీవాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ అనడం కూడా టీడీపీ వర్గాలకు మింగుడుపడడం లేదు. తామేదో బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్నట్లు పవన్ కల్యాణ్ మాట్లాడారని అంటున్నారు.
అయితే, ఇప్పటికీ బీజేపీ నేతలు పొత్తుల విషయం తేల్చడం లేదు. ఒక రకంగా టీడీపీతోనూ జనసేనతోనూ బీజేపీ ఆడుకుంటోంది. ఓవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూసుకుపోతుంటే తాము వెనకబడి పోతున్నామని, ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొందని, దీనికంతా పవన్ కల్యాణ్ కారణమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబును పవన్ కల్యాణ్ ముంచేట్లు ఉన్నాడని ఆ వర్గాలు మండిపడతున్నాయి.