మోడీ భేటీ పవన్‌ను నిరాశపరిచిందా..?
కొన్ని నిమిషాల పాటు మాట్లాడిన నరేంద్రమోడీ.. మరోసారి కలుద్దామని చెప్పేసి పవన్‌ను పంపించారు. బయటకు వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో ఎక్కువ సేపు మాట్లాడలేదు.
ప్రధాని మోడీ- పవన్ కల్యాణ్ భేటీ బ్రహ్మాండం బద్ధలయ్యేలా ఉంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. కనీసం రోడ్డు మ్యాప్ ఇవ్వడం లేదు, కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ బాధపడుతున్నట్టు గుర్తించి ఆ ముచ్చట తీర్చేందుకే ఈ భేటీ అన్నట్టుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భేటీలో చాలాసేపు కుశల ప్రశ్నలతోనే సరిపోయింది. అనంతరం జగన్‌పై పవన్ కల్యాణ్ ఫిర్యాదులు చేసినట్టు చెబుతున్నారు. పవన్ చెబుతున్న వివరాలకు ఎక్కువగా ప్రధాని నరేంద్రమోడీ ''ఇవన్నీ నాకు తెలుసు.. ఈ విషయం నా దృష్టిలోనూ ఉంది.. ఇంకా ఏమైనా ఉందా?'' అంటూ మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై పోరాటం ఒక్కటే మార్గమని పవన్ కల్యాణ్ చెప్పగా.. నరేంద్రమోడీ మౌనంగా ఆలకించారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారని మోడీకి ఫిర్యాదు చేశారు.
సమావేశం కూడా ఎక్కువ సేపు సాగలేదు. పది నిమిషాల పాటు భేటీ జరిగింది. అందులో చాలా సేపు కుశల ప్రశ్నలకే సరిపోయింది. తొలుత నాదెండ్ల మనోహర్ కూడా భేటీలో పాల్గొన్నారు. ఆయన కొన్ని నిమిషాల తర్వాత బయటకు వెళ్లగా మోడీ, పవన్ ఇద్దరు మరికొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ బయటకు వచ్చేశారు. కొన్ని నిమిషాల పాటు మాట్లాడిన నరేంద్రమోడీ.. మరోసారి కలుద్దామని చెప్పేసి పవన్‌ను పంపించారు. బయటకు వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో ఎక్కువ సేపు మాట్లాడలేదు. విశాఖ హోటల్‌లో ఇటీవల మిమ్మల్ని నిర్బంధించిన అంశాన్ని ప్రధానికి వివరించారా అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా తర్వాత అన్ని విషయాలు చెబుతా అంటూ పవన్ వెళ్లిపోయారు.