ఆ విషయంలో పవన్ భయపడుతున్నాడా..?
టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండుచోట్ల పోటీచేయడానికి ఎలాంటి అడ్డంకీ లేకపోయింది. కానీ, ఈసారి టీడీపీతో పొత్తులో భాగంగా పరిమితమైన సీట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉంటుంది.
జగన్‌ను పదవి నుంచి దింపడమే తన లక్ష్యమని చెబుతూ రాష్ట్రమంతటా పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తన వారాహి యాత్రను తాజాగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు పలు నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతామని చెబుతున్న పవన్ కళ్యాణ్.. పొత్తు ఖరారు కాకుండానే తనకు కేటాయించే సీట్లు ఎన్నో.. ఎక్కడెక్కడో ఖాయం చేసుకోకుండానే.. తన పార్టీ తరఫున అభ్యర్థులను మాత్రం ప్రకటించేస్తుండటం గమనార్హం. ఇంకోపక్క టీడీపీ తరఫున సీటు ఆశిస్తున్న ఆశావహులకు ఇది మింగుడు పడటం లేదు.
ఇదంతా ఒకెత్తు అయితే.. పవన్ కళ్యాణ్ పోటీచేసే స్థానాలు ఏమిటి..? ఈసారి కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా..? లేక ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారా..? గతంలో రెండు స్థానాల నుంచి పోటీ చేసినా రెండింటా ఓటమినే చవిచూసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? ఇవన్నీ ఇప్పుడు సందేహాలుగా ఉన్నాయి.
గతంలో టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండుచోట్ల పోటీచేయడానికి ఎలాంటి అడ్డంకీ లేకపోయింది. కానీ, ఈసారి టీడీపీతో పొత్తులో భాగంగా పరిమితమైన సీట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఆ కొద్ది సీట్లలో పవన్ రెండు సీట్లలో తానే పోటీచేస్తే.. ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆశపడుతున్నవారికి నిరాశే మిగులుతుంది.
సంక్షేమ పథకాలతో జగన్ ప్రభుత్వం ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న తరుణంలో రానున్న ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ అయితే కాదని చంద్రబాబుకు, పవన్‌కు కూడా స్పష్టంగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి సీటూ కీలకంగా మారే అవకాశముంటుంది. అయినా.. రెండు చోట్ల పోటీచేసేందుకు పవన్ నిర్ణయించుకుంటే చంద్రబాబు అందుకు అంగీకరించే అవకాశముంటుందా అన్నది కూడా ప్రశ్నార్థకమే.
ఇదిలావుంటే.. అసలు తాను ఎక్కడి నుంచి పోటీచేసేదీ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పష్టం చేయకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో పోటీచేసిన విధంగా గాజువాక, భీమవరం స్థానాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు అయితే కనిపించడం లేదు. ఈసారి మాత్రం పిఠాపురం, తిరుపతి నుంచి పోటీచేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. అయితే ఆ విషయంలో పవన్ నుంచి మాత్రం ఇంతవరకూ క్లారిటీ రాలేదు.
తాజాగా అందుతున్న మరో సమాచారం ఏమిటంటే.. తాను పోటీచేసే సీటును ఇప్పట్లో ప్రకటించనని, అదే జరిగితే.. జగన్ తనను ఓడించేందుకు ఎంతైనా ఖర్చు చేస్తాడని పవన్ భావిస్తున్నారట. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న జగన్.. తనను ఓడించేందుకు కూడా ప్లాన్ చేసే అవకాశముందని పవన్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. 2019లో కూడా పవన్ తాను పోటీచేసే సీట్ల సమాచారాన్ని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు ప్రకటించలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని భావిస్తున్నారట. అయితే చివర్లో తన సీట్లు ప్రకటించినప్పటికీ గత ఎన్నికల్లో రెండుచోట్లా పవన్ ఓడిపోయారు. మరి ఈసారి పవన్ తాను పోటీచేసే సీటు / సీట్ల విషయం ఎప్పటికి ప్రకటిస్తారనేది వేచిచూడాలి.