మహాసేన రాజేష్ టైమ్ అవుటేనా..?
అగ్రవర్ణాల అమ్మాయిలను ముఖ్యంగా బ్రాహ్మణ అమ్మాయిలను ఎవరైనా లేపుకెళ్ళి పెళ్ళిచేసుకుంటే వాళ్ళకు తలా లక్షరూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు.
ఇప్పుడు టాక్ ఆఫ్ పాలిటిక్స్ ఏమిటంటే.. కోనసీమ జిల్లాలోని పీ.గన్నవరం అనే చెప్పాలి. ఈ నియోజకవర్గం ఎందుకింత పాపులర్ అయ్యిందంటే మహాసేన రాజేష్ కు చంద్రబాబునాయుడు టికెట్ ఇవ్వటం వల్లే. రాజేష్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈమధ్యనే ఇతను టీడీపీలో చేరాడు. వెంటనే చంద్రబాబు టికెట్ ప్రకటించేశారు. పార్టీలో చేరిన వెంటనే టికెట్ ఎలావచ్చిందంటే లోకేష్ కోటాలో రాజేష్ టికెట్ దక్కించుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. రాజేష్ కు టికెట్ ప్రకటించగానే పార్టీలోని టీడీపీ నేతలే కాదు మామూలు జనాలు, జనసేన నేతలూ పెద్దఎత్తున ఆందోళన మొదలుపెట్టారు.
విషయం ఏమిటంటే.. రాజేష్ ఒకప్పుడు చాలా వీడియోలు చేశాడు. అందులో హిందూ దేవుళ్ళు, దేవతలను నోటికొచ్చినట్లు తిట్టాడు. అలాగే అగ్రవర్ణాల అమ్మాయిలను ముఖ్యంగా బ్రాహ్మణ అమ్మాయిలను ఎవరైనా లేపుకెళ్ళి పెళ్ళిచేసుకుంటే వాళ్ళకు తలా లక్షరూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను కూడా నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతేకాకుండా కాపులనూ బూతులు తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.
రాజేష్ అంటే బయటవాళ్ళకు తెలియకపోవచ్చు కాని తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని జనాలకు బాగా తెలుసు. వీళ్ళని, వాళ్ళని లేదు ఇతనికి ఎవరు గుర్తుకొస్తే వాళ్ళని బూతులు తిడుతూ వీడియోలు చేసి రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. బహుశా ఆ వీడియోలు చేసినప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తానని, టీడీపీలో చేరుతానని, తనకు టికెట్ ఇస్తారని ఊహించుండడు. అందుకనే నోటికొచ్చినట్లు అందరినీ తిట్టాడు. అప్పట్లో చేసిన వీడియోలే ఇప్పుడు తనకు శాపంగా మారాయి.
రాజేష్ ను తప్పించకపోతే కొత్తపేట, మండపేట, అమలాపరంలో కూడా పార్టీ ఓడిపోతుందని అక్కడి అభ్యర్థులు, నేతలు కూడా చంద్రబాబుపైన బాగా ఒత్తిడి తెచ్చారట. దాంతో తెరవెనుక ఏమైందో తెలీదు కానీ, పోటీ నుండి తప్పుకుంటున్నట్లు రాజేష్ ప్రకటించాడు. అంటే నామినేషన్ కూడా వేయకుండానే రాజేష్ టైమ్ అవుట్ అయినట్లు లెక్క. ఆ ప్రకటనలో తాను చాలా అమాయకుడినన్నట్లు, కులరక్కసి చేతిలో తాను బలైపోయాయని, తనకు టికెట్ రావటాన్ని మిగిలిన వాళ్ళు తట్టుకోలేకపోయారని ఏదేదో మాట్లాడాడు. పైగా ‘జగన్ రెడ్డి గుర్తుపెట్టుకుంటా’నని వార్నింగ్ ఒకటి. నియోజకవర్గంలోని జనాలు, ముఖ్యంగా కాపులు, బ్రాహ్మణులు, పార్టీలోని ఇతర నియోజకవర్గాల్లోని నేతలు కూడా రాజేష్ ను తప్పించాలని చంద్రబాబుపై ఒత్తిడిపెట్టడంతో తప్పించాల్సొచ్చింది. తప్పులన్నీ తానుచేసి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.