Telugu Global
Andhra Pradesh

జనసేన ‘సినిమా పార్టీ’ అయిపోతోందా..?

పార్టీలో కీలకస్ధానాల్లో ఉన్న వాళ్ళల్లో ఒక్క నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన వారిలో అత్యధికులు సినిమావాళ్ళే. వీళ్ళందరినీ పక్కనపెట్టేస్తే అసలు జనసేన ఆధారపడిందే సినిమా అభిమానుల మీద.

జనసేన ‘సినిమా పార్టీ’ అయిపోతోందా..?
X

జనసేన రాజకీయ పార్టీగా కాకుండా సినిమా పార్టీగా మారిపోతున్నట్లుంది. అదేదో సినిమాలో గంగ చంద్రముఖిలా మారిపోయినట్లుగా తయారవుతోంది జనసేన పార్టీ వ్యవహారం. తాజాగా బన్నీవాస్‌ను పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు పవన్. బన్నీవాస్ అంటే సినిమా దర్శకుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. పవన్‌కు స్ట్రాంగ్ సపోర్టర్‌గా ఉండే బన్నీని పార్టీ కీలక స్థానంలో నియమించారు. ప్రచార కమిటీ ఛైర్మన్ అంటే రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయటం కోసమే తీసుకున్న విషయం అర్థ‌మవుతోంది.

బన్నీకి పొలిటికల్ అడ్వర్టైజింగ్‌లో మంచి అనుభవం ఉందన్న కారణంగానే ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారట. గతంలో చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా బన్నీ అందులో పనిచేశారు. కాబట్టి ఎంతో కొంత రాజకీయ అనుభవం కూడా ఉండే ఉంటుందనటంలో సందేహం అవసరంలేదు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరఫున బన్నీ పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ విషయం తెలీదుకానీ, ముందైతే పార్టీకి హోల్ టైమర్ బాధ్యతల్లో అయితే తీసుకున్నారు.

అధినేత పవనే సినిమా నటుడని అందరికీ తెలిసిందే. అలాగే సోదరుడు నాగబాబు కూడా సినిమా నటుడే. పార్టీలో మరో స్ట్రాంగ్ సపోర్టర్ పృధ్వీ కూడా సినిమా నటుడే. జనసేనకు బ్యాక్ గ్రౌండ్‌లో ఉంటూ పనిచేస్తున్న మారుతి కూడా సినిమా దర్శకుడే. మొత్తంమీద పార్టీలో కీలకస్ధానాల్లో ఉన్న వాళ్ళల్లో ఒక్క నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన వారిలో అత్యధికులు సినిమావాళ్ళే. వీళ్ళందరినీ పక్కనపెట్టేస్తే అసలు జనసేన ఆధారపడిందే సినిమా అభిమానుల మీద.

ఏదో రూపంలో పవన్ సినిమాలకు పనిచేస్తున్న వాళ్ళు, పవన్ సినిమాలకు ఫైనాన్షియర్లు కూడా జనసేనకు బ్యాక్ గ్రౌండ్లో సపోర్టుగా పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద చూస్తే జనసేన రాజకీయ పార్టీ అనేకన్నా సినిమా పార్టీగా తయారైపోతోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. రాజకీయపార్టీ అధినేతకు ఉండాల్సిన లక్షణాలేవీ పవన్‌లో కనబడటంలేదు. తాను అధికారంలోకి వచ్చే విషయం గురించి కాకుండా ఎన్ని సంవత్సరాలైనా చంద్రబాబునాయుడు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న కారణంగానే జనసేన ఎదగలేకపోతోంది.

First Published:  17 Dec 2023 10:20 AM IST
Next Story