జగన్ పర్యటన గ్రాండ్ సక్సస్సేనా ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు జరిపిన కుప్పం పర్యటన విజయవంతం అయ్యిందని వైసీపీ కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.
చంద్రబాబునాయుడు అడ్డాగా ఉన్న కుప్పంలో ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్సార్ చేయూత పథకంలో లబ్దిదారుల ఖాతాల్లో రు. 4,949 కోట్లను జగన్ బటన్ నొక్కి జమచేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభకు లబ్దిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కుప్పం అంటే చంద్రబాబు పాలనకాదని తన అడ్డా అన్నట్లుగా జగన్ ప్రసంగించారు. బహిరంగసభలో జగన్ మాట్లాడుతు నా ఎస్సీ, ఎస్టీ, నా బీసీ, నా మైనారిటి అంటు వ్యూహాత్మకంగా పై వర్గాలను వెనకేసుకొచ్చేట్లుగా మాట్లాడారు. పైగా జనవరి నుండి రు. 2500 పెన్షన్ను రు. 2750కి పెంచబోతున్నట్లు ప్రకటించారు.
కుప్పంలో బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జగన్ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలన్నీ లబ్దిదారులకు అందేట్లుగా చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించారు. ఇళ్ళపట్టాలు, ఇళ్ళ నిర్మాణాలు ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా లబ్దిదారులకు నూరుశాతం చేరేట్లుగా పర్యవేక్షిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించే బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైన జగన్ మోపారు. అందుకు అవసరమైన వనరులను జగన్ అందిస్తున్నారు. ఇపుడు జరిగిన బహిరంగ సభ కూడా వాళ్ళిద్దరి వ్యూహంలో భాగమే. చంద్రబాబుపై మైండ్ గేమ్ ఆడటంలో జగన్+పెద్దిరెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. 2019కి ముందువరకు చంద్రబాబు ఎప్పుడో కానీ నియోజకవర్గానికి వచ్చేవారు కాదు. చివరకు ఎన్నికల సమయంలో నామినేషన్ కూడా నేతల ద్వారానో లేకపోతే లాయర్ ద్వారానో పంపేవారు.
అలాంటి చంద్రబాబు మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లో తగిలిన దెబ్బ కారణంగా ప్రతి రెండునెలలకు వచ్చి మూడురోజులుంటున్నారు. ఇవన్నీ సరిపోదన్నట్లు ఇపుడు సక్సెస్ అయిన భారీ బహిరంగసభ. 175కి 175 సీట్లలో గెలుపు గ్యారెంటీ అని, చంద్రబాబు ఓటమి ఖాయమని నియోజకవర్గం మొత్తం మీద వైసీపీ గోడరాతలు రాయించింది. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమనే చెప్పాలి. దీన్నే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.