జగన్ నిర్ణయం వ్యూహాత్మకమేనా..?
వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సీ. రామచంద్రయ్యలపైన కూడా అనర్హత వేటు వేయాలని పార్టీ తరఫున శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖ అందింది.
సడెన్‌గా జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే.. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని. అప్పుడెప్పుడో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీలోని నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు వీళ్ళు ఓట్లేశారన్నది పార్టీ ఆభియోగం.
పార్టీ సస్పెండ్ చేసిన దగ్గర నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీతో కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ళ నలుగురిపైన అనర్హత వేటు వేయాలని పార్టీ తరఫున అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ అందింది. అధికారపార్టీ తరఫున అనర్హత వేటుకు లేఖ అందింది కాబట్టి వేటు పడటం ఖాయమనే అనుకోవాలి. కాకపోతే ఇప్పుడు అనర్హత వేటు వేసి ఏమి ఉపయోగమో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఎందుకంటే.. మరో మూడునెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళపై అనర్హత వేటు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే.
ఇదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సీ. రామచంద్రయ్యలపైన కూడా అనర్హత వేటు వేయాలని పార్టీ తరఫున శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు లేఖ అందింది. వీళ్ళిద్దరూ వైసీపీకి రాజీనామా చేశారు. వంశీ జనసేనలో చేరగా, రామచంద్రయ్య టీడీపీలో చేరారు. వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు వేయటం మాత్రం వ్యూహాత్మకమనే చెప్పాలి.
ఎలాగంటే వంశీ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా 2021లో ఎన్నికయ్యారు. ఈయన కాలపరిమితి ఇంకా రెండేళ్ళుంది. అలాగే రామచంద్రయ్య ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయన కాలపరిమితి మరో మూడేళ్ళుంది. అంటే వీళ్ళిద్దరిపైనా అనర్హత వేటుపడి స్థానాలు ఖాళీ అయితే వీళ్ళ స్థానంలో మరో ఇద్దరికి అవకాశం ఇవ్వొచ్చని జగన్ ఆలోచించినట్లున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ రెండు స్థానాలను భర్తీచేస్తున్నట్లు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎమ్మెల్యే టికెట్లు దక్కని వాళ్ళలో ఎవరినైనా జగన్ ఎమ్మెల్సీలుగా పంపే అవకాశముంది. కాబట్టి ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వల్ల పార్టీకి లాభమనే అనుకోవాలి.