జగన్ ప్రభుత్వం నిజంగానే వణికిపోతోందా?
అసలు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపోరు సభలు జరిగిందా అనేది కూడా ఎవరికీ పెద్దగా తెలీదు. పైగా ఒకటి వందా కాదు ఏకంగా 7 వేల సభలు పెట్టారట. ఆ సభలకు జనాలు వేలంవెర్రిగా హాజరయ్యారట.
ఏపీలో బీజేపీ నేతల వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని పదే పదే చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారం అని తొడలు కొడుతుంటారు. తీరాచూస్తే అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి అసలు గట్టి అభ్యర్థులు దొరుకుతారా అంటే మళ్ళీ సౌండుండదు. ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పార్టీ నిర్వహించిన ప్రజాపోరు సభలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వణికిపోతోందన్నారు.
అసలు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపోరు సభలు జరిగిందా అనేది కూడా ఎవరికీ పెద్దగా తెలీదు. పైగా ఒకటి వందా కాదు ఏకంగా 7 వేల సభలు పెట్టారట. ఆ సభలకు జనాలు వేలంవెర్రిగా హాజరయ్యారట. తమ సభలకు హాజరైన జనాల ఆలోచనలు, ఆగ్రహం చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోయిందట. ఏడువేల సభలను రెండువారాల్లో నిర్వహించారట. జగన్ మూడున్నరేళ్ళ పాలనపై జనాల్లో బాగా అసంతృప్తి, వ్యతిరేకత స్పష్టంగా కనబడిందని రెడ్డి గారంటున్నారు.
ఏ ప్రభుత్వం మీదైనా జనాల్లో కొంతకాలం తర్వాత అసంతృప్తి సహజంగానే ఉంటుంది. అయితే అధికారపార్టీని దింపేసి ప్రతిపక్షాలను అధికారంలోకి తీసుకురావాలన్నంత వ్యతిరేకత, కసి జనాల్లో ఉందా అనేదే కీలకం. బీజేపీ నేతలు చెప్పినంత కసి, తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో ఉందా అనేది అనుమానమే. అందులోను వైసీపీని దింపేసి బీజేపీని అధికారంలో కూర్చోబెట్టడం అంటే విష్ణు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనుకోవాలి.
ఇక్కడ సమస్య ఏమిటంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాల్లో పోటీచేయటానికి బీజేపీకి గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం. పోటీ చేయటానికే గట్టి అభ్యర్ధులను వెతుక్కోవాల్సిన బీజేపీ ఏకంగా అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే నమ్మేదెట్లా ? ముందు అన్నీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను చూసుకుంటే అదే పదివేలు. ముందు పోటీకి గట్టి అభ్యర్ధులను వెతుక్కోవాలి, తర్వాత వాళ్ళందరికీ డిపాజిట్లు దక్కాలి. ఆ తర్వాత కదా అధికారంలోకి వచ్చే విషయాన్ని ఆలోచించాల్సింది.