Telugu Global
Andhra Pradesh

ఎన్టీయార్‌కే అవమానమా?

ఎన్టీయార్ భార్యగా ఆ నాణేన్ని ముందుగా అందుకోవాల్సింది భార్య లక్ష్మీపార్వతి మాత్రమే. కానీ తెరవెనుక జరిగిన కుట్ర కారణంగా అసలు లక్ష్మీపార్వతిని రాష్ట్రపతి భవన్ కార్యక్రమానికే ఆహ్వానించలేదు.

ఎన్టీయార్‌కే అవమానమా?
X

100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీయార్‌ను అవమానించిందనే చెప్పాలి. మామూలుగా భర్త లేనపుడు భర్త పేరుతో జరిగే ఫంక్షన్‌కు భార్యను పిలవటం ఆనవాయితీ. అయితే ఆనవాయితీని కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టేసింది. భార్యకు అసలు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులను పిలిచి ఫంక్షన్ కానిచ్చేసింది. అదే ఇప్పుడు వివాదమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్టీయార్ పేరుతో 100 రూపాయల నాణేన్ని విడుదల చేసింది.

ఎన్టీయార్ భార్యగా ఆ నాణేన్ని ముందుగా అందుకోవాల్సింది భార్య లక్ష్మీపార్వతి మాత్రమే. కానీ తెరవెనుక జరిగిన కుట్ర కారణంగా అసలు లక్ష్మీపార్వతిని రాష్ట్రపతి భవన్ కార్యక్రమానికే ఆహ్వానించలేదు. లక్ష్మీపార్వతి ఆరోపణల ప్రకారం మొత్తం వ్యవహారాన్ని ఎన్టీయార్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరే నడిపించేశారు. ఆమె ఎలాగూ బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు పైగా ఇపుడు ఏపీ అధ్యక్షురాలు కూడా. ఇంకేముంది మొత్తం ఫంక్షన్‌కు లక్ష్మీపార్వతికి ప్రవేశం లేకుండా చేసేశారు.

దీని మీద లక్ష్మీపార్వతి ఇప్పుడు పురదేశ్వరిని శాపనార్ధాలు పెడుతున్నారు. సరే లక్ష్మీపార్వతిని, పురందేశ్వరిని పక్కన పెట్టేస్తే అసలు అవమానం జరిగింది ఎన్టీయార్‌కే. బతికుండగా అవమానించిన కుటుంబ సభ్యులే చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు మళ్ళీ అవమానించారు. ఎన్టీయార్‌కు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అందరు కలిసి వెన్నుపోటు పొడిచిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని లక్ష్మీపార్వతి ప్రస్తావిస్తు వెన్నుపోటులో తెరమీద అందరికీ కనిపించింది చంద్రబాబు అయితే తెర వెనుక పురందేశ్వరి పాత్ర అంతే కీలకమన్నారు.

ఎన్టీయార్‌ను పదవిలో నుండి దింపేసి, పార్టీని లాగేసుకుని, రోడ్డు మీదే చెప్పులతో కొట్టేందుకు కారణమైన కుటుంబ సభ్యులే 100 రూపాయల కాయిన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవటం ఆశ్చర్యంగా ఉంది. ఎన్టీయార్‌కు ఇంతకుమించిన అవమానం ఏముంటుంది? వేలాది మంది అభిమానుల సమక్షంలో వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతిని ఎన్టీయార్ భార్యగా కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే అది వాళ్ళిష్టం. కానీ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా లక్ష్మీపార్వతిని ఎన్టీయార్ భార్యగా అంగీకరించకపోవటమంటే అది ఎన్టీయార్‌ను అవమానించటమే.


First Published:  29 Aug 2023 5:55 AM GMT
Next Story