Telugu Global
Andhra Pradesh

ఎల్లోమీడియా యజమానే అసలు కబ్జాదారుడా..?

అప్పుడెప్పుడో విశాఖపట్నం ఆఫీసు విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. అప్పుడు కూడా కోర్టు గట్టిగా చీవాట్లు పెడితే వేరేదారిలేక స్థ‌లాన్ని ఖాళీచేసి యజమానికి అప్పగించారు.

ఎల్లోమీడియా యజమానే అసలు కబ్జాదారుడా..?
X

ఎల్లోమీడియా యజమానిపై జగన్మోహన్ రెడ్డి మీడియా బ్యానర్ స్టోరీ ఇచ్చింది. ‘గురివింద.. గుంజీలు’ అనే హెడ్డింగ్ తో రాసిన స్టోరీలో సదరు యజమాని చేసిన కబ్జాలను ఉదాహరణలతో సహా ఇచ్చింది. ఈ స్టోరీ ప్రకారం అసలు కబ్జాదారుడు ఎల్లోమీడియా యజమానే అన్న విషయం అర్థ‌మవుతోంది. విజయవాడ బెంజ్ సర్కిల్లోని పత్రిక ఆఫీసు ఉన్న 3 ఎకరాల స్థ‌లం ఎల్లోమీడియాది కాదు. బంధువు దగ్గర లీజుకు తీసుకున్నారు. లీజు గడువు ముగిసినా స్థ‌లాన్ని ఖాళీ చేయకుండా తన ఆధీనంలోనే ఉంచుకున్నారు.

రోడ్డు విస్తరణ చేయాలంటే చేయనీయకుండా అడ్డుకున్నారట. మళ్ళీ రోడ్డు విస్తరణ జరగటంలేదని వార్తలు ఇస్తున్నారు. రోడ్డు విస్తరణకు చివరకు ఓకే చెప్పి అందుకు భూయజమానికి టీడీఆర్ రూపంలో అందాల్సిన నష్టపరిహారాన్ని తనకే ఇవ్వాలని పేచీపెట్టారు. కోర్టులో కేసువేసి పదేళ్ళు నడిపారు. చివరకు నష్టపరిహారం భూయజమానికి అందుతుందే కానీ, అద్దెకుండే వాళ్ళకి కాదని కోర్టు స్పష్టంచేయటంతో వేరేదారిలేక కొద్దిరోజుల క్రితమే స్థ‌లాన్ని ఖాళీచేశారు. ఇలాంటి కబ్జాలు, పేచీలు సదరు ఎల్లోమీడియా యజమానికి కొత్తేమీకాదు.

అప్పుడెప్పుడో విశాఖపట్నం ఆఫీసు విషయంలో కూడా ఇలాగే వ్యవహరించారు. అప్పుడు కూడా కోర్టు గట్టిగా చీవాట్లు పెడితే వేరేదారిలేక స్థ‌లాన్ని ఖాళీచేసి యజమానికి అప్పగించారు. పైగా రోడ్డు వెడల్పు సందర్భంగా భూయజమానికి అందాల్సిన టీడీఆర్‌ను కూడా తానే తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అంతకుముందు హైదరాబాద్ సోమాజీగూడలోని ఆఫీసు కాంపౌండ్‌ను కూడా రోడ్డును ఆక్రమించి కట్టేశారు. దానిపై కోర్టులో పెద్ద పోరాటం జరిగింది. కోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీ కబ్జాను విడిపించి రోడ్డు వెడల్పు చేయాల్సొచ్చిందట.

ఇక ఫిలింసిటీ వ్యవహారం అందరికీ తెలిసిందే. అందులో అసైన్డ్ భూములున్నాయి, రహదారులున్నాయి, చెరువులు, గుట్టలు కూడా ఉన్నాయట. రాజవంశీయుల భూములను సదరు యజమాని కబ్జాచేసినట్లు ఈమధ్యనే సీనియర్ నేత గోనె ప్రకాశరావు మీడియాలో ఆరోపించిన విషయం తెలిసిందే. అంటే ఒకవైపు తాను ప్రభుత్వ, ప్రైవేటు భూములు, స్థ‌లాలను కబ్జాలు చేస్తూ, మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై ప్రతిరోజు బురదచల్లేయటం సదరు ఎల్లోమీడియా యజమానికి బాగా అలవాటైపోయిందని కథనంలో ఇచ్చారు.

First Published:  9 Jan 2024 5:40 AM GMT
Next Story