వైసీపీ, టీడీపీని కేసీఆర్ టార్గెట్ చేయబోతున్నారా ?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ తరపున పోటీచేయటానికి అవకాశం రానివాళ్ళు ఎవరనే విషయంలో ఇప్పటికే కేసీఆర్ కసరత్తు చేశారట. ఇక్కడ రెండు రకాలున్నాయి.
కేసీఆర్ నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏపీలోని ప్రధాన పార్టీల మీదే గురిపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయటానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఇప్పటికిప్పుడు కేసీఆర్ పార్టీకి గట్టి అభ్యర్థులు దొరకడం కష్టమనే చెప్పాలి. అందుకనే ఇతర పార్టీల్లోని గట్టి అభ్యర్థులకోసం గాలమేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ గాలం కూడా ప్రధానంగా వైసీపీ, టీడీపీల్లోని నేతలకే వేస్తోందట.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ తరపున పోటీచేయటానికి అవకాశం రానివాళ్ళు ఎవరనే విషయంలో ఇప్పటికే కేసీఆర్ కసరత్తు చేశారట. ఇక్కడ రెండు రకాలున్నాయి. వైసీపీ విషయం చూస్తే ట్రాక్ రికార్డు సరిగాలేని, పనితీరు మెరుగుపరుచుకోని సిట్టింగుల్లో కొందరికి టికెట్లు దక్కటం కష్టమనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల్లో సుమారు 35 మందికి జగన్ టికెట్లివ్వరనే ప్రచారం బాగా జరుగుతోంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే జనసేనతో పొత్తు కారణంగా సుమారు 45 మందికి టికెట్లు దక్కవనే ప్రచారం తెలిసిందే. అటు వైసీపీలోని 35 మంది, ఇటు టీడీపీలోని 45 మందికి తమ నియోజకవర్గాల్లో అంతో ఇంతో పట్టు అయితే ఉంది. కాకపోతే అనేక కారణాలతో వీళ్ళకి టికెట్లు దక్కవు. మరి ఈ 80 మంది ఏమిచేస్తారు ? తమ గెలుపుపై నమ్మకముంటే వీరిలో కొందరు ఇండిపెండెంట్ గా పోటీచేసే అవకాశముంది. మరి మిగిలిన వాళ్ళు ఏంచేస్తారు ?
ఇక్కడే బీఆర్ఎస్ కీలకమవుతోంది. ఊరికే ఇంట్లో కూర్చోలేరు, టికెట్లు దక్కినవాళ్ళకి పనిచేయలేరు. ఇలాంటి వాళ్ళల్లో కొందరు బీఆర్ఎస్ తరపున పోటీచేసే అవకాశముంది. అవసరమైన నిధులను సమకూరుస్తానని కేసీఆర్ హామీఇస్తే బీఆర్ఎస్ తరపున కొన్ని నియోజకవర్గాల్లో గట్టి నేతలే పోటీకి దిగే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ జాతీయపార్టీగా నిలదొక్కుకోవాలంటే సీట్లతో పాటు ఓట్లు కూడా చాలా అవసరం. ఏపీలో సీట్లు రాకపోయినా గౌరవప్రదంగా ఓట్లొస్తే చాలని కేసీఆర్ అనుకుంటున్నారట. బీఆర్ఎస్ తరపున పోటీచేసే వాళ్ళు ఎంత గట్టివాళ్ళయితే పార్టీకి అన్ని ఓట్లొస్తాయికదా. ఇప్పటికి కేసీఆర్ కు ఇదిచాలు మిగిలిన విషయాలు మెల్లిగా చూసుకుంటారు.