Telugu Global
Andhra Pradesh

బుట్టాకు దిక్కుతోచటంలేదా..?

మాచాని చేనేత వర్గానికి చెందిన నాయ‌కుడు. ఇంతకాలం ఎమ్మెల్యే మద్దతుదారుడిగానే ఉండిపోయారు. వైసీపీకి పడుతున్న చేనేతల ఓట్ల వెనుక మాచానే కీలకమట.

బుట్టాకు దిక్కుతోచటంలేదా..?
X

పార్టీవర్గాల నుంచి ఇప్పటికి అందిన సమాచారం ప్రకారమైతే మాజీ ఎంపీ బుట్టా రేణుకకు షాక్ తప్పేట్లు లేదు. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానానికి ఇన్చార్జిగా మాచాని వెంకటేష్‌ను జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి పోటీచేయాలని బుట్టా చాలాకాలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికే టికెట్ ఇస్తారన్న సంకేతాలతో ఏమిచేయాలో బుట్టాకు అర్థంకాలేదు. కర్నూలు ఎంపీగా అవకాశాలు దాదాపు లేవని తేలిపోవటంతోనే ఎమ్మిగనూరు నుంచి పోటీచేసేందుకు బుట్టా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

బుట్టాకు పోటీగా రుద్రగౌడ్ ఉన్నా.. ఎమ్మెల్యేనే కీలకమయ్యారు. అయితే తాజాగా జరుగుతున్న మార్పుల్లో చెన్నకేశవరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. ఎమ్మెల్యేకి లేదా ఆయన కొడుక్కి కూడా టికెట్ ఇవ్వదలచుకోని జగన్ సడెన్ గా మాచాని వెంకటేష్ పేరును తెర‌పైకి తెచ్చారు. వెంకటేష్‌ను ప్రకటించింటానికి కారణం ఎమ్మెల్యేనే అని పార్టీవర్గాల సమాచారం. తనకు లేదా తన కొడుక్కి టికెట్ ఇవ్వరని తేలిపోయిన వెంటనే ఎమ్మెల్యే మాచాని వెంకటేష్ పేరును ప్రతిపాదించారట.

మాచాని చేనేత వర్గానికి చెందిన నాయ‌కుడు. ఇంతకాలం ఎమ్మెల్యే మద్దతుదారుడిగానే ఉండిపోయారు. వైసీపీకి పడుతున్న చేనేతల ఓట్ల వెనుక మాచానే కీలకమట. మాచాని పేరునే ఎమ్మెల్యే ఎందుకు ప్రస్తావించారంటే ఎమ్మెల్యేకి బుట్టా రేణుక‌కు ఏమాత్రం పడదట. బుట్టా కూడా చేనేతవర్గానికి చెందిన నేతే కాబట్టి చేనేత సామాజికవర్గానికే చెందిన వెంకటేష్ పేరును ఎమ్మెల్యే ఎర్ర‌కోట ప్రతిపాదించారని సమాచారం.

మాచానికి రుద్రగౌడ్ కూడా మద్దతు ప్రకటించారు. అంటే బుట్టాకు ఎమ్మెల్యే, రుద్రగౌడ్, మాచాని అందరు వ్యతిరేకమే అని అర్థ‌మైంది. కాబట్టే జగన్ కూడా బుట్టా పేరును పట్టించుకోలేదు. చేనేతలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఎమ్మిగనూరు కూడా ఒకటి. తాజా పరిణామాల్లో అటు కర్నూలు ఎంపీగా పోటీచేసే అవకాశాలు బుట్టాకు దాదాపు లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎమ్మిగనూరులో కూడా అవకాశం పోయింది. ఈ పరిస్థితుల్లో ఏమిచేయాలో బుట్టాకు అర్థం కావటంలేదట.

First Published:  6 Jan 2024 11:02 AM IST
Next Story