Telugu Global
Andhra Pradesh

బీజేపీ ‘ప్లాన్-బీ’ రెడీ చేస్తోందా..?

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మహా అయితే ఓ 15 సీట్లు రావచ్చు. అందులో బీజేపీ ఎన్నిగెలుస్తుందో కూడా తెలీదు. ఈమాత్రం దానికి టీడీపీతో పొత్తు పెట్టుకునేకన్నా ఒంటరిగానే పోటీచేసే విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తోంది.

బీజేపీ ‘ప్లాన్-బీ’ రెడీ చేస్తోందా..?
X

రాబోయే ఎన్నికలకు సంబంధించి ఏపీ విషయంలో బీజేపీ అగ్రనేతలు ప్లాన్-బీ అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ+జనసేన కూటమిగా సీట్ల సర్దుబాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరికొన్ని నియోజకవర్గాలను బీజేపీ కోసమే పెండింగులో పెట్టారు. మొదటి జాబితాను విడుదల చేయటం బీజేపీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచటం కోసమే అని పార్టీవర్గాల సమాచారం. ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చంద్రబాబు పొత్తు గురించి ఫిబ్రవరి 6వ తేదీన మాట్లాడారు. అప్పటినుండి ఇప్పటివరకు పొత్తుపై బీజేపీ ఏమీ తేల్చలేదు.

ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఫైనల్ చేసి సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. ఇంకోవైపు పొత్తు విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటో తెలీక టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే నష్టపోవటం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే కమలనాధులపై ఒత్తిడి తేవటంలో భాగంగానే మొదటి జాబితాను హడావుడిగా రిలీజ్ చేశాయి. ఇదే విషయాన్ని బీజేపీ అగ్రనేతలు అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నారట. మొదటి జాబితా రిలీజ్ విషయం నేపథ్యంలోనే ప్లాన్-బీ అమలు చేయాలని డిసైడ్ అయిన‌ట్లు సమాచారం.

ఇంతకీ ప్లాన్‌-బీ ఏమిటంటే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మహా అయితే ఓ 15 సీట్లు రావచ్చు. అందులో బీజేపీ ఎన్నిగెలుస్తుందో కూడా తెలీదు. ఈమాత్రం దానికి టీడీపీతో పొత్తు పెట్టుకునేకన్నా ఒంటరిగానే పోటీచేసే విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తోంది. వైసీపీ, టీడీపీలో టికెట్లు రాని అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి కూడా వచ్చిందట. స్వతంత్రంగా 175 సీట్లలోనూ అభ్యర్థులను పోటీకి దింపటమే ప్లాన్-బీ అని అర్థ‌మవుతోంది.

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. వైసీపీలోనే 25 మంది ఎమ్మెల్యేల‌కు టికెట్లు దక్కలేదు. అలాగే టీడీపీలో కనీసం 50 మంది సీనియర్లకు టికెట్లు రావటంలేదు. ఇక జనసేనలో టికెట్లు ఆశించి చాలా నియోజకవర్గాల్లో భంగపడ్డారు. ఎందుకంటే.. జనసేన పోటీచేస్తున్నదే 24 నియోజకవర్గాల్లో.. కాబట్టి వైసీపీ, టీడీపీ, జనసేన నుండి బలమైన, సీనియర్లను చేర్చుకుని టికెట్లిస్తే క‌చ్చితంగా ప్రత్యర్థి పార్టీలకు మంచి పోటీ ఇవ్వొచ్చని అగ్రనేతలు ఆలోచించారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

First Published:  2 March 2024 10:46 AM IST
Next Story