Telugu Global
Andhra Pradesh

సుజనా.. పుట్టింటికి వచ్చేస్తున్నారా..?

ఇటీవల బీజేపీ నేత సత్యకుమార్ పై జరిగిన దాడి ఘటనపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. అయితే అసలు కారణం వేరే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సుజనా చౌదరి బీజేపీ ముసుగు తొలగించి టీడీపీలో చేరిపోతారని సమాచారం.

సుజనా.. పుట్టింటికి వచ్చేస్తున్నారా..?
X

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత సుజనా చౌదరి టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక.. ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలతో పాటు సుజనా చౌదరి కూడా బీజేపీ గూటికి చేరారు. వారందరినీ చంద్రబాబే బీజేపీలోకి పంపించారన్న వాదన కూడా ఉంది. ఇదిలా ఉంటే.. టీడీపీలోనుంచి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్.. ఏపీలో బీజేపీ బలోపేతం కోసం ఏ మాత్రం కృషిచేయలేదనేది అంద‌రికీ తెలిసిన స‌త్యం. పైగా వారంతా టీడీపీ నేతల్లాగానే మాట్లాడేవారు. చంద్రబాబును ఒక్క మాట కూడా అనకుండా.. కేవలం జగన్ సర్కారుపైనే విమర్శలు గుప్పించేవారు.

ఇదిలా ఉంటే.. పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం టీడీపీలో కొత్త ఉత్సాహం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ లా పనిచేశాయి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. తాజాగా తెలుగుదేశం మద్దతుదారుడిగా పేరున్న సుజనా చౌదరి.. గుంటూరులో టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.

ఇటీవల బీజేపీ నేత సత్యకుమార్ పై జరిగిన దాడి ఘటనపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. అయితే అసలు కారణం వేరే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సుజనా చౌదరి బీజేపీ ముసుగు తొలగించి టీడీపీలో చేరిపోతారని సమాచారం. ఎన్నికల నాటికి ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారనే ప్ర‌చారం జోరందుకుంటోంది. సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ టీడీపీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకొనే దిశగా ఆయన మంత్రాంగాలు నడుపుతున్నారు.

కానీ, బీజేపీ పెద్దల లెక్కలు వేరుగా ఉన్నాయి. వారు చంద్రబాబుతో పొత్తుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి నేతలకు మింగుడు పడటం లేదు. పైగా స్థానికంగా ఉన్న బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి వంటి వారు కూడా టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సత్యకుమార్ లాంటి కొంతమంది మాత్రమే.. టీడీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు పరోక్షంగా కాకుండా.. డైరెక్ట్ గానే సపోర్ట్ చేసేందుకు సుజనా టీడీపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి సుజనా చౌదరి నిజంగానే టీడీపీలో చేరతారా..? లేక ఎప్పటిలాగానే బీజేపీలోనే ఉండి టీడీపీకి తన సపోర్ట్ అందిస్తారా..? అన్నది వేచి చూడాలి.

First Published:  3 April 2023 10:42 AM IST
Next Story