జనసేనానిని భీమవరం భయపెడుతోందా..?
నాలుగు రోజుల కిందట పవన్ భీమవరం వచ్చినప్పుడు పట్టణంలో ర్యాలీగా వెళ్లారు. ఇందులో జనసైనికుల హడావుడే తప్ప ఓ నాయకుడు వచ్చాడని ఏ ఇంట్లో నుంచీ జనం తొంగి చూడలేదు.
భీమవరం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్. గత ఎన్నికల్లో ఇక్కడ చావుదెబ్బ తిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తారా? అంటే అవునని జనసేన వర్గాలు బల్లగుద్దుతున్నాయి. కానీ, సైన్యాధిపతికి మాత్రం ధైర్యం చాలట్లేదా అనిపిస్తోంది. తొలి జాబితాలో తన పేరును భీమవరం అభ్యర్థి అని ప్రకటించుకోవడానికి పవన్ ముందుకు రాకపోవడం.. ఆయన ఇంకా డైలమాలోనే ఉన్నారా అనే ప్రశ్న లేవనెత్తుతోంది.
సొంత సామాజికవర్గమే మైనస్సా?
సాధారణంగా జనసేనకు ప్లస్‌పాయింట్‌గా ఉండే కాపు సామాజికవర్గమే ఇక్కడ పవన్‌కు మైనస్ కానుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్‌ను మట్టి కరిపించిన వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్‌ది కూడా కాపు సామాజిక వర్గమే. పైగా ఆయన స్థానికంగా అందుబాటులో ఉండే నేత, వివాద రహితుడు. ప్రభుత్వ పథకాలు అందనివారైవరైనా ఉంటే తప్ప ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో నెగటివ్ లేదు. పైగా ఒకే సామాజికవర్గం. దీంతో కాపులు పవన్ కంటే గ్రంధికే ఎక్కువ విలువిస్తారని భీమవరంలో టాక్.
జనస్పందన గుర్తించారా..?
నాలుగు రోజుల కిందట పవన్ భీమవరం వచ్చినప్పుడు పట్టణంలో ర్యాలీగా వెళ్లారు. ఇందులో జనసైనికుల హడావుడే తప్ప ఓ నాయకుడు వచ్చాడని ఏ ఇంట్లో నుంచీ జనం తొంగి చూడలేదు. కనీసం సినిమా హీరోగా అయినా క్రేజ్ ఉంటుంది కదా. కానీ జనసైనికులు షేర్ చేస్తున్న వీడియోల్లో కూడా పవన్ చేతులూపుతున్న దృశ్యాలే తప్ప కేరింతలు కొడుతున్న జనం కనపడలేదు. ఇది పవన్‌ను ఆలోచింపజేస్తోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
భీమవరం కరెక్ట్ కాదు అని చెప్పినా..
పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరంనుంచి పోటీచేసినప్పుడే చాలామంది పెదవి విరిచారు. అదో ప్రత్యేక నియోజకవర్గ మని, అక్కడ రాజులకు, కాపులకు పోటీ తప్ప కాపులకు, కాపులకు పోటీ ఏమిటని ప్రశ్నించారు. సొంత జిల్లాలోని పాలకొల్లులో చిరంజీవే ఓడిపోయినా కూడా ప్రజారాజ్యం అభ్యర్థిని గెలిపించుకున్న తాడేపల్లిగూడెం లాంటి సీటు అయితే సేఫ్ అని చెప్పారు. అయినా పవన్ వినకుండా వెళ్లి బోర్లాపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేయొద్దని, సేఫ్ సీట్ చూసుకుందామని జనసేన నేతలు నచ్చజెప్పాలని చూసినా పవన్ ఓడిన చోటే గెలవాలని పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. కానీ ఇప్పడు మళ్లీ డైలమాలో పడినట్లే కనిపిస్తోంది.