Telugu Global
Andhra Pradesh

ఐప్యాక్ తో జగన్ చర్చలు.. ఎమ్మెల్యేలలో గుబులు

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా జగన్ సమాచారం తీసుకున్నారని, ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయావకాశాలను అడిగి తెలుసుకున్నారని అంటున్నారు.

ఐప్యాక్ తో జగన్ చర్చలు.. ఎమ్మెల్యేలలో గుబులు
X

ఐప్యాక్ పై సీఎం జగన్ కు చాలా నమ్మకం ఉంది, అదే సమయంలో ఐప్యాక్ అంటే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు భయం కూడా ఉంది. ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్ ల ప్రకారం సీఎం జగన్ గతంలో ఎమ్మెల్యేలకు చీవాట్లు పెట్టారు. గడప గడపకు ఎందుకు తిరగడంలేదని ప్రశ్నించారు, ప్రజల్లోకి వెళ్లకపోతే టికెట్ ఇవ్వలేనంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో జగన్ ని ప్రసన్నం చేసుకోడానికంటే ముందు ఐ ప్యాక్ టీమ్ ని ప్రసన్నం చేసుకోడానికి నాయకులు శ్రమిస్తున్నారు. వారి దృష్టిలో మంచి పేరు తెచ్చుకోడానికి పాకులాడుతున్నారు. అయితే తాజాగా ఐప్యాక్ టీమ్ మరోసారి జగన్ తో భేటీ అయింది. దీంతో ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐప్యాక్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. వైసీపీ ముఖ్యనేతలు, ఐప్యాక్‌ టీమ్‌ ఇన్‌ ఛార్జ్ రిషిరాజ్‌, ఇతర సభ్యులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా జగన్ సమాచారం తీసుకున్నారని, ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల విజయావకాశాలను అడిగి తెలుసుకున్నారని అంటున్నారు.

సురక్ష సంగతేంటి..?

గడప గడప కార్యక్రమంతోపాటు ఇటీవల జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని కూడా ఐ ప్యాక్ సలహాతోనే తెరపైకి తెచ్చారు. ప్రజల వద్దకు ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తో ప్రజల ఇంటి వద్దకే వెళ్లి సర్టిఫికెట్లు మంజూరు చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అని ఆరా తీశారు జగన్. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు. ఎమ్మెల్యేల తాజా పనితీరుపై ఐప్యాక్ టీం నివేదికలు ఇచ్చిట్టు సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గాల్లో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యేల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న ఈ సందర్భంలో అత్యవసరం అనుకున్న చోట ఇన్ చార్జ్ లను నియమించడం, లేదా మార్చడం వంటి అవకాశాలున్నాయని అంటున్నారు. ఐప్యాక్ తాజా నివేదికతో వైసీపీ ఎమ్మెల్యేలలో కొత్త టెన్షన్ మొదలైంది.

First Published:  7 July 2023 6:48 PM IST
Next Story