పోలవరం పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థ ప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నిపుణుల బృందం భేటీ అవుతుంది.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మీవల్లే లేటయిందని వైసీపీ, కాదు మీ వల్లే పోలవరం సర్వ నాశనం అయిందంటూ టీడీపీ.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల శ్వేతపత్రం విడుదల చేసి మరీ గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు సీఎం చంద్రబాబు. తాజాగా ఆయన పోలవరం నిర్మాణంలో నిపుణుల సలహాలు స్వీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం అంతర్జాతీయ జలవనరుల నిపుణులు ఏపీకి వచ్చారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు నిపుణుల బృందం నేటినుంచి తమ పని ప్రారంభించబోతోంది. నాలుగురోజులపాటు వారు పోలవరం ప్రాజెక్ట్ వద్ద మకాం వేసి పరిస్థితిని అంచనా వేస్తారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సీఎస్‌ఎంఆర్‌ఎస్ సంస్థ ప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నిపుణుల బృందం భేటీ అవుతుంది. వీరి సలహాలు సూచనల ప్రకారం పోలవరం నిర్మాణం విషయంలో ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తుంది. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల పోలవరం డ్యామ్ నిర్మాణం ఆలస్యమైందని, ప్రాజెక్ట్ పూర్తికావాలంటే మరో నాలుగేళ్లు టైమ్ పడుతుందని సీఎం చంద్రబాబు గత ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం తెలిసిందే. మరి నిపుణుల పర్యవేక్షణ తర్వాత పోలవరంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
పోలవరం ప్రాజెక్ట్ అప్పుడు, ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగానే ఉంది. అధికారంలో ఉన్నవారు తమ హయాంలోనే పూర్తి చేస్తామంటారు, గత ప్రభుత్వాలు తప్పులు చేశాయంటారు. ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీదే తప్పు అంటారు. ఇప్పుడు కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. ఈ దశలో అంతర్జాతీయ నిపుణులు ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది.