తాడేపల్లిలో తాడికొండ పంచాయితీ.. సజ్జలతో శ్రీదేవి భేటీ..
తాడేపల్లిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, సజ్జలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా ఉండటం విశేషం. ఇన్ చార్జ్ గా డొక్కాను తొలగించాలని సజ్జలకు విజ్ఞప్తి చేశారు శ్రీదేవి.
తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ని నియమించడంతో మొదలైన గొడవ చివరకు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు చేరింది. తాడేపల్లిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, సజ్జలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత కూడా ఉండటం విశేషం. ఇన్ చార్జ్ గా డొక్కాను తొలగించాలని సజ్జలకు విజ్ఞప్తి చేశారు శ్రీదేవి. అదనపు ఇన్ చార్జ్ నియామకంతో నియోజకవర్గంలో తన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని, వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే ప్రచారం కూడా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారామె.
వైసీపీ గెలిచిన 151 నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల స్థానిక ఎమ్మెల్యేలపై కంప్లయింట్లు ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారు. గడప గడపలో పాల్గొనకపోవడం, ప్రజల్లోకి వెళ్లకపోవడం, నియోజకవర్గాలకు దూరంగా ఉండటం.. ఇలా కొన్ని కారణాలతో ఎమ్మెల్యేల విషయంలో జగన్ ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే తాడికొండలో డొక్కాకు అదనపు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది. నియోజకవర్గంలోకి వస్తున్న డొక్కా మాణిక్యవరప్రసాద్ కు అడుగడుగునా శ్రీదేవి మద్దతుదారులు అడ్డుపడుతున్నారు. వైసీపీలో ఈ అంతర్గత పోరు ప్రతిపక్షాలకు అనుకోని ఆయుధంగా మారుతోంది. శ్రీదేవి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలకు జగన్ చెక్ పెడతారని, వారంతా ఆల్టర్నేట్ వెదుక్కోవాల్సిన అవసరం వస్తుందని అంటున్నారు.
డొక్కా వివరణ..
శ్రీదేవి తన కుటుంబ సభ్యురాలని, తనకు చెల్లెలు లాంటి వారని సర్దిచెబుతున్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. శ్రీదేవి తండ్రి, సోదరులతో కలసి తాను రాజకీయాలు చేశానని, శ్రీదేవి ఆధ్వర్యంలో తాను కూడా పనిచేస్తానని అన్నారు. శ్రీదేవికి అన్యాయం జరగదని చెబుతున్నారు. ఆమె రాజకీయ భవిష్యత్తుని జగన్ చూసుకుంటారని భరోసా ఇచ్చారు.
సజ్జల పంచాయితీతో ఏం జరుగుతుంది..?
గతంలో గన్నవరం పంచాయితీ కూడా ఇలాగే హాట్ హాట్ గా సాగి ముగిసిపోయింది. హిందూపురం విషయంలో అంతర్గత పోరు ఇంకా సమసిపోలేదు. ఇప్పుడు కొత్తగా తాడికొండ నియోజకవర్గం గొడవ మొదలైంది. ఈ పంచాయితీ సజ్జల వద్ద ఫైనల్ అవుతుందా, లేక సీఎం వద్దకు వెళ్తుందా అనేది వేచి చూడాలి.