టీడీపీలో త్రీ ఇడియట్స్.. సొంత పార్టీ నేతల హాట్ కామెంట్స్..
అలిగి వెళ్తున్న నాయకులు పార్టీలో త్రీ ఇడియట్స్ ఉన్నారని, వారు ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఎవరిపై అనేది తేలాల్సి ఉంది.
జిల్లాలవారీగా టీడీపీ సమావేశాలు అంతర్గత విభేదాలను బయటపెడుతున్నాయి. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా సమావేశం రసాభాసగా మారింది. త్రీ ఇడియట్స్ అంటూ హాట్ కామెంట్లు వినపడ్డాయి. సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ఈ సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, సమావేశం కోసం కట్టిన బ్యానర్లో తమ ఫొటోలు లేవని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాకపోవడం మరో విశేషం.
త్రీ ఇడియట్స్ ఎవరు..?
అలిగి వెళ్తున్న నాయకులు పార్టీలో త్రీ ఇడియట్స్ ఉన్నారని, వారు ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు ఎవరిపై అనేది తేలాల్సి ఉంది. అధిష్టానంపై వారు ఆరోపణలు చేశారా, లేక కృష్ణా జిల్లా నాయకులపై మండిపడ్డారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, కృష్ణా జిల్లా టీడీపీ అద్యక్షుడు కొనకళ్ళ నారాయణ హాజరయ్యారు. ఢిల్లీలో సమావేశం ఉన్నందున ఎంపీ కేశినేని నాని రాలేదని వేదికపై అనౌన్స్ చేసినా.. ఆయన ఆల్రడీ కమల దళంతో గూడుపుఠానీ నడుపుతున్న విషయం తెలిసిందే.
ఇదే సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఇద్దరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశాల గురించి తమకు సమాచారమే ఇవ్వడం లేదన్నారు. అందుకే ఆలస్యమైందని చెప్పారు. అటు జిల్లా స్థాయి సమావేశాల్లో బ్యానర్‌లో తమ ఫోటోలు ఎందుకు లేవని నిలదీశారు. పార్టీలో త్రీ ఇడియట్స్ ఉన్నంత కాలం బాగుపడదని అంటూ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు. సీనియర్లు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికి వారు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సమావేశంలో జరిగిన గొడవ హాట్ టాపిక్‌గా మారింది.