Telugu Global
Andhra Pradesh

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న సర్వే

డెక్కన్ సంస్థ‌ నిర్వహించిన సర్వే ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే వివరాలను నియోజకవర్గాలతో సహా ఇచ్చింది. అయితే పార్టీల తరఫున పోటీచేయబోయే అభ్యర్థులు ఫైనల్ కాకుండానే నియోజకవర్గాల్లో గెలుపోటముల వివరాలను ప్రకటించటం కాస్త అత్యుత్సాహంగా కనిపించింది.

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న సర్వే
X

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక సర్వే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఆ సర్వే ప్రకారం వైసీపీ 100 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. టీడీపీ+జనసేన కూటమికి 65 సీట్లు వస్తాయని, మరో పది నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చేసింది. డెక్కన్ 24/7 అనే సంస్థ‌ నిర్వహించిన సర్వేలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఫలితాలు కూడా ఇచ్చింది. సంస్థ‌ చెప్పిన ప్రకారం ప్రతి నియోజకవర్గంలోనూ 2,150 మందితో శాంపుల్ సర్వే నిర్వహించింది. రాష్ట్రం మొత్తం మీద 3,92,000తో మాట్లాడిన తర్వాతే ఫలితాలను అంచనా వేసింది.

ఈ సర్వే శాంపుల్ ఎందుకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంటే.. ఇప్పటివరకు వచ్చిన ప్రీపోల్ సర్వేలకన్నా భిన్నంగా ఉండటమే కారణం. జాతీయ మీడియా సంస్థ‌లు, సర్వే సంస్థ‌లు వెల్లడించిన సర్వే ఫలితాల్లో వైసీపీకే ఘనవిజయం అని తేల్చాయి. అయితే అవన్నీ పార్లమెంటు ఎన్నికల ప్రాతిపదికన సర్వే నిర్వహించాయి. అందులోను వైసీపీ-టీడీపీ-జనసేన మూడు పార్టీలు విడివిడిగా పోటీచేస్తే రాబోయే ఫలితాలు అని చెప్పాయి.

ఇక్కడే సదరు సంస్థ‌ల సర్వే తప్పని అర్థ‌మవుతోంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నపుడు రెండుపార్టీలు వేర్వేరుగా పోటీచేస్తే.. అన్న పద్ధ‌తిలో సర్వే చేయటమే తప్పు. వైసీపీ-టీడీపీ+జనసేన అన్న పద్ధ‌తిలో సర్వేచేస్తే రాబోయే ఫలితాలు మారిపోతాయి. ఇప్పుడు డెక్కన్ సంస్థ‌ ఇదే పద్ధ‌తిలో సర్వే నిర్వహించింది. వైసీపీ విడిగా టీడీపీ+జనసేన కలిసి పోటీచేస్తే ఫలితాలు ఎలాగుండబోతాయన్న పద్ధ‌తిలో సర్వే నిర్వహించింది.

డెక్కన్ సంస్థ‌ నిర్వహించిన సర్వే ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే వివరాలను నియోజకవర్గాలతో సహా ఇచ్చింది. అయితే పార్టీల తరఫున పోటీచేయబోయే అభ్యర్థులు ఫైనల్ కాకుండానే నియోజకవర్గాల్లో గెలుపోటముల వివరాలను ప్రకటించటం కాస్త అత్యుత్సాహంగా కనిపించింది. ఎందుకంటే పోటీచేయబోయే అభ్యర్థులను బట్టి కూడా గెలుపోటములు మారిపోయే అవకాశాలున్నాయి. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో గెలుపు వైసీపీ లేదా టీడీపీ+జనసేన కూటమికి అంత ఈజీకాదన్న విషయం మాత్రం అర్థ‌మవుతోంది.

First Published:  9 Jan 2024 10:46 AM IST
Next Story