Telugu Global
Andhra Pradesh

అర్జీల పేరుతో దాడులు.. ఏపీ మంత్రులకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జనసైనికుల నుంచి ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఉంటుందనే అంచనాలున్నాయి. నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే అవకాశముందని, అర్జీలు ఇచ్చినట్టు వారి దగ్గరకు వచ్చి దాడి చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

అర్జీల పేరుతో దాడులు.. ఏపీ మంత్రులకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
X

ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ఏపీలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. విశాఖ గర్జన తర్వాత మంత్రుల కాన్వాయ్ పై రాళ్లదాడి, దానికి ప్రతిగా ఇటు టెక్కలిలో జనసేన పార్టీ ఆఫీస్ ధ్వంసం.. వరుస పరిణామాలు రాజకీయాలను హాట్ హాట్ గా మార్చేశాయి. మంత్రులు మైకందుకున్నారంటే చంద్రబాబు, దత్తపుత్రుడు.. అనే మాటలు మినహా మిగతావి వినిపించట్లేదు. ఆఖరికి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే, పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి లోగా అనే సమాధానాలు మంత్రులనుంచి వినపడుతున్నాయి. అంటే ఎవ్వరూ తగ్గట్లేదు, జనాలు ఏమనుకుంటున్నారోననే ఆలోచన ఎవరికీ లేదు, తిట్టామా, తిట్టిచ్చుకున్నామా, వీలైతే బూతులు, కాకపోతే చెప్పులు.. ఇలా ఉన్నాయి ఏపీ రాజకీయాలు. ఈ దశలో కొంతమంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అర్జీల పేరుతో దాడులు..

ఇటీవల పవన్ కల్యాణ్ పై విమర్శల డోస్ భారీగా పెంచారు వైసీపీ నేతలు. దానికి పర్యవసానంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో కాన్వాయ్ పై దాడి జరిగిందని అంటున్నారు. ఆ తర్వాత కూడా నాయకులు రెట్టించడం, జనసేన కార్యాలయం ధ్వంసం కావడంతో జనసైనికుల నుంచి ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందనే అంచనాలున్నాయి. నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే అవకాశముందని, అర్జీలు ఇచ్చినట్టు వారి దగ్గరకు వచ్చి దాడి చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ నాయకులు, అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

సోషల్ మీడియాలో ప్రచారం..

సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై కేసులు పెడుతున్నా కూడా ఎవ్వరూ తగ్గట్లేదు. పైగా మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులపై దాడుల కోసం సోషల్ మీడియా వేదికగా సమాచారం సర్క్యులేట్ అవుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఆయా వాట్సప్ గ్రూప్ లు, ఫేస్ బుక్ పేజీలపై దృష్టిపెట్టాయి. వాటిలో సర్క్యులేట్ అవుతున్న వార్తల ఆధారంగా కొంతమంది వైసీపీ నేతలను ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం చేశాయి. ప్రజల్లోకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.

First Published:  23 Oct 2022 6:07 AM GMT
Next Story