Telugu Global
Andhra Pradesh

ఏపీలో బీచ్ ఐటీ.. మే 31నుంచి విశాఖలో ఇన్ఫోసిస్

తొలిదశలో 650 మంది ఉద్యోగులతో వైజాగ్‌ లో ఆఫీస్ ప్రారంభిస్తామంటున్నారు సంస్థ ప్రతినిధులు. రుషికొండ సిగ్నటివ్ టవర్స్ లో ఇన్ఫోసిస్ ఆఫీస్ మొదలవుతుంది.

ఏపీలో బీచ్ ఐటీ.. మే 31నుంచి విశాఖలో ఇన్ఫోసిస్
X

బీచ్‌ ఐటీ అనే నినాదంతో విశాఖ పట్నంలో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని అంటోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా మొదటగా ఇన్ఫోసిస్ కార్యకలాపాలు విశాఖలో మొదలు కాబోతున్నాయి. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్‌ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించడానికి రెడీ అవుతున్నాయని సమాచారం.

మే-31నుంచి

విశాఖ పట్నం రాజధానిగా పాలన మొదలు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు మంత్రులు ఆ దిశగా హింట్లిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే రుషికొండపై కొత్త భవనాలు ఏర్పాటవుతున్నాయి. ఇక విశాఖను ఐటీ క్యాపిటల్ గా కూడా మార్చేస్తామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. విశాఖ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభిస్తామన్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌, మే-31న మహూర్తం ఖరారు చేసింది. మే-31 నుంచి విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెడతామని తాజాగా ప్రకటించింది. తొలిదశలో 650 మంది ఉద్యోగులతో వైజాగ్‌ లో ఆఫీస్ ప్రారంభిస్తామంటున్నారు సంస్థ ప్రతినిధులు. రుషికొండ సిగ్నటివ్ టవర్స్ లో ఇన్ఫోసిస్ ఆఫీస్ మొదలవుతుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రిక్రూట్ అయిన వారిని వైజాగ్ క్యాంపస్‌ కి బదిలీ చేయబోతున్నారు.

ఇన్ఫోసిస్‌ రాక విశాఖ అభివృద్ధికి సంకేతమంటున్న ప్రభుత్వం ఇప్పటికే ఉన్న మిగతా సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామంటోంది. ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా వెంటనే అందించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెబుతున్నారు అధికారులు. ఇన్ఫోసిస్ రాకతో 650మంది ఉద్యోగులు ఇక్కడికి వస్తారని, కాలేజీల్లో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా తీసుకునే ట్రైనీలకు కూడా విశాఖలోనే ఇంటర్న్ షిప్ నిర్వహిస్తారని తెలుస్తోంది.

First Published:  15 Feb 2023 11:19 AM IST
Next Story