Telugu Global
Andhra Pradesh

ఏపీలో పారిశ్రామికాభివృద్ధి.. ఇంతకంటే సాక్ష్యాలు కావాలా..?

కంపెనీల విషయానికొస్తే, JSW స్టీల్, రామ్ కో సిమెంట్, సెంచురీ ప్యానల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్.. వంటి పరిశ్రమలు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నాయి. మొత్తంగా ఏపీలో జరిగిన, జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి ద్వారా 33.63 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఏపీలో పారిశ్రామికాభివృద్ధి.. ఇంతకంటే సాక్ష్యాలు కావాలా..?
X

వైసీపీ హయాంలో ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడిందనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. దానికి తగ్గట్టే ఫలానా కంపెనీ వెళ్లిపోయింది, ఫలానా కంపెనీని తరిమేశారంటూ ఎల్లో మీడియా వంత పాడుతోంది. కానీ అసలైన అభివృద్ధి విషయంలో వారు ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. టీడీపీ కంటే వైసీపీ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి గరిష్టంగా జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

311 భారీ పరిశ్రమలు.. లక్షా 30వేల ఉద్యోగాలు.. గడచిన 55 నెలల కాలంలో ఏపీలో జరిగిన పారిశ్రామికాభివృద్ధికి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇక సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల విషయానికొస్తే.. వైసీపీ ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 3.94 లక్షల MSME యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా 26.29 లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్రవ్యాప్తంగా MSME లకోసం ప్రభుత్వం 54 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద 2,087 కోట్ల రూపాయలను ప్రోత్సాహకాలుగా ఇచ్చింది.

ఇక ఎగుమతులు, దిగుమతులకోసం ఇప్పటికే ఉన్న ఆరు ఓడరేవులతోపాటు కొత్తగా మరో 4 పోర్ట్ లను అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. 16వేల కోట్ల రూపాయల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్ట్ లను అభివృద్ధి చేస్తోంది. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 11 కోట్ల టన్నుల సరకు రవాణాకు అవకాశం లభిస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 75వేల మందికి ఉపాధి లభిస్తుంది. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను.. రూ.3,793 కోట్ల రూపాయల ఖర్చుతో అందుబాటులోకి తెస్తోంది జగన్ ప్రభుత్వం. ఇవన్నీ పూర్తి స్థాయిలో సిద్ధమైతే సువిశాల తీరప్రాంతం ఉన్న ఏపీలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ లేదా పోర్ట్ ఉన్నట్టు అవుతుంది.

భోగాపురంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వల్ల 10వేలమందికి నేరుగా, 80వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇది రూ.4,592 కోట్ల భారీ ప్రాజెక్ట్. దీంతోపాటు గన్నవరం, కాకినాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్ పోర్ట్ ల విస్తరణ కూడా చురుగ్గా సాగుతోంది.

కంపెనీల విషయానికొస్తే, JSW స్టీల్, రామ్ కో సిమెంట్, సెంచురీ ప్యానల్స్, ATC టైర్స్, ఆదిత్య బిర్లా గార్మెంట్స్, డిక్సన్ టెక్నాలజీస్, గ్రీన్ లామ్ సౌత్, లారస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్.. వంటి పరిశ్రమలు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నాయి.

విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏకంగా 386 MOUలు కుదిరాయి. వీటి ద్వారా 3.94 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. 6 లక్షల ఉద్యోగ అవకాశాలు మన యువతకు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా ఏపీలో జరిగిన, జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి ద్వారా 33.63 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో గత మూడేళ్లుగా ఏపీ, భారత్ లోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. GSDP గ్రోత్ రేట్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. వైసీపీ హయాంలో ఏపీ సాధించిన, సాధిస్తోన్న పారిశ్రామిక ప్రగతి ఇది.

First Published:  16 April 2024 12:11 PM IST
Next Story