పారాచూట్ తెరుచుకోక.. నేవీ కమాండో మృత్యువాత.. - కోల్‌కతాలో ట్రైనింగ్ కార్యక్రమంలో ఘటన
గోవింద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. వీరంతా నెల రోజుల క్రితం విశాఖపట్నం నుంచి ట్రైనింగ్ కోసం కోల్‌కతాకు వెళ్లారు.
కోల్‌కతాలో నిర్వహిస్తున్న నేవీ కమాండోల శిక్షణ కార్యక్రమంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కిందికి దూకిన కమాండో సందక గోవింద్ వందల అడుగుల ఎత్తులో ఉండగా.. పారాచూట్ తెరుచుకోలేదు. దీంతో అంత ఎత్తు నుంచి కిందికి పడిపోయిన కమాండో అక్కడికక్కడే మృతిచెందాడు. పారాచూట్ టెక్నికల్ ఇష్యూతోనే తెరుచుకొని ఉండకపోవచ్చు అని అధికారులు భావిస్తున్నారు.
మొత్తం 9 మంది కమాండోలు గోవింద్‌తో పాటు ఈ శిక్షణలో పాల్గొన్నారు. వారు కూడా గోవింద్‌తో పాటే కిందికి దూకారు. గోవింద్ మినహా మిగిలినవారి పారాచూట్‌లు తెరుచుకున్నాయి. గోవింద్ పారాచూట్ మాత్రమే తెరుచుకోకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
గోవింద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. వీరంతా నెల రోజుల క్రితం విశాఖపట్నం నుంచి ట్రైనింగ్ కోసం కోల్‌కతాకు వెళ్లారు. అక్కడ అనుకోకుండా జరిగిన ఈ ఘటన అతని ప్రాణాలనే తీసింది. ఈ ఘటన అనంతరం నేవీ అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఈ ఘటనతో ఒక్కసారిగా పర్ల గ్రామంలో విషాదం అలుముకుంది. అతని కుటుంబ సభ్యులు గోవింద్ మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే గోవింద్ మృతిచెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. గోవింద్ మృతదేహం పర్ల గ్రామానికి శుక్రవారం చేరుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.