Telugu Global
Andhra Pradesh

కిడ్నాప్ కాదు.. తల్లి చేతిలో నుంచే బావిలోకి..

బాలుడు ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదన్న ఒక నిర్ధారణకు వచ్చిన పోలీసులు చివరకు తల్లి సాయిలక్ష్మిని విచారించారు. దాంతో అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది.

కిడ్నాప్ కాదు.. తల్లి చేతిలో నుంచే బావిలోకి..
X

నరసరావుపేటలో కనిపించకుండా పోయిన బాలుడి ఘ‌ట‌న విషాదాంతంగా ముగిసింది. తొలుత బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. అది వాస్తవం కాదని ఆ తర్వాత తేలింది. ఇంటి సమీపంలోని బావిలో బాలుడి మృత‌దేహం కనిపించింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం బండివారి పాలానికి చెందిన వాసు, సాయి లక్ష్మి దంపతులు నరసరావుపేట శివారులోని బ్యాంక్ కాలనీలో నివాస‌ముంటున్నారు. శనివారం సాయంత్రం నుంచి తమ బాలుడు కనిపించలేదని వారు పోలీసులను ఆశ్రయించారు. అదే రోజు వెంట్రుకలు కొంటామని కొందరు తమ వీధిలోనికి వచ్చారని, బహుశా వారే తమ బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో కాల‌నీలోని సీసీ టీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు.

బాలుడు ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లలేదన్న ఒక నిర్ధారణకు వచ్చిన పోలీసులు చివరకు తల్లి సాయిలక్ష్మిని విచారించారు. దాంతో అప్పుడు ఆమె అసలు విషయం చెప్పింది. బావి గోడపై ఆడిస్తూ ఉండగా తన కుమారుడు బావిలోకి పడిపోయాడని సాయిలక్ష్మి పోలీసులకు వివరించింది. ఈ విషయం చెబితే భర్త, బంధువులు ఏమంటారో అన్న భయంతో చెప్పలేదని బోరున విలపించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు బాలుడి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు.

బాలుడి తల్లి సాయిలక్ష్మికి మతిస్థిమితం సరిగా లేదని, కాన్పు సమయం నుంచి ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని బంధువులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ క్యాన్సర్ కారణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఆమె మరింత ఆందోళనగా ఉన్నారు. ఆమెకు చికిత్స కూడా అందిస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేని మాట వాస్తవమేనని బాలుడిని ఉద్దేశపూర్వకంగా బావిలో పడేసి ఉండదని, పొరపాటునే జరిగి ఉంటుందని బంధువులు కూడా అభిప్రాయపడుతున్నారు.

First Published:  23 Jan 2023 2:57 AM GMT
Next Story