Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షాలకు హైకోర్టు షాక్

అత్యవసరం కానీ ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించిందని సీజే వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాలకు హైకోర్టు షాక్
X

రోడ్లపై రాజకీయ పార్టీల సభలు సమావేశాలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో -1 విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒక విధంగా ప్రతిపక్షాలకు షాక్ తగిలింది. జీవోను సవాల్ చేస్తూ తొలుత సీపీఐ రామకృష్ణ హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్‌ను ఇటీవల విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్‌తో కూడిన వెకేషన్‌ ధర్మాసనం జీవోను సస్పెండ్ చేసింది. బ్రిటిష్ కాలంలో కూడా ఇలాంటి జీవో రాలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ వ్యవహారాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించాల్సిందిగా ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. అందులో భాగంగానే ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. ఆ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సీజే.

జీవో అమలుపై సస్పెన్షన్‌ కొనసాగింపుకు కోర్టు నిరాకరించింది. జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం ఇచ్చిన స్టే సమయంలో నేటితో ముగిసిపోయింది. దాంతో రేపటి నుంచి జీవో-1 అమలుకు లైన్ క్లియర్ అయింది. వెకేషన్ బెంచ్‌ ఇది వరకు రామకృష్ణ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించడాన్ని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తప్పుపట్టింది.

అత్యవసరం కానీ ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించడం ద్వారా వెకేషన్ బెంచ్ తన పరిధిని మించి వ్యవహరించిందని సీజే వ్యాఖ్యానించారు. ప్రతి కేసు ముఖ్యమైనదిగా భావిస్తే ఎలా అని సీజే ధర్మాసనం ప్రశ్నించింది. ఇలాంటివి జరిగితే వెకేషన్ బెంచే ప్రధాన న్యాయమూర్తి పాత్ర పోషించినట్టు అవుతుందని అసహనం వ్యక్తం చేసింది.

ఈ కేసు వివరాలను పూర్తిగా తెలుసుకున్నామని... అంత అత్యవసరం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రీ వద్ద ఈ పిటిషన్ విషయంలో కొందరు ప్రభావం చూపే ప్రయత్నం చేశారని బట్టు దేవానంద్ ధర్మాసనం ఇదివరకు వ్యాఖ్యానించింది. పరోక్షంగా ప్రధానన్యాయమూర్తి ధర్మాసనం ఆ వ్యాఖ్యలను ప్రస్తావించింది. తనకు ఏమీ తెలియదనుకోవద్దు... రిజిస్ట్రి ఎప్పటికప్పుడు తనకు వివరాలను నివేదించారని సీజే చెప్పారు. అసలు ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలంటూ వెకేషన్ బెంచ్ ముందు ధర్నా ఏమైనా జరిగిందా అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది కోర్టు.

First Published:  24 Jan 2023 12:35 AM IST
Next Story