Telugu Global
Andhra Pradesh

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. ఇంటికే వైజాగ్‌ స్టీల్‌!

ఇప్పటివరకూ వివిధ కంపెనీలు, స్టీల్‌ వ్యాపార సంస్థలు, హార్డ్‌వేర్‌ దుకాణాలకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఉత్పత్తులు విక్రయించేవారు. తమ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తాజాగా సరికొత్త మార్గాన్ని ఎంపిక చేశారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. ఇంటికే వైజాగ్‌ స్టీల్‌!
X

వైజాగ్‌ స్టీల్‌ ఉత్పత్తులు ఇకపై ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికే రానున్నాయి. ఇప్పటివరకు బల్క్‌గా తన ఉత్పత్తులు అందజేసిన సంస్థ.. ఇప్పుడు తమ సేవలను ప్రతి ఇంటికీ చేరువ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ని అభివృద్ధి చేసిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఇంటి నుంచే బుకింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఒకపక్క వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి ప్రైవేటీకరణ ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. ప్లాంట్‌ అధికారులు, ఉద్యోగులు మాత్రం ప్లాంట్‌ అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. లాభాల దిశగా ప్లాంట్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. హాట్‌ మెటల్, ముడి ఉక్కు, సేలబుల్‌ స్టీల్‌ అమ్మకాల్లో విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ గణనీయమైన వృద్ధి సాధిస్తూ.. 17 శాతానికి పైగా విక్రయ వృద్ధి సాధించడం గమనార్హం.

ఇప్పటివరకూ వివిధ కంపెనీలు, స్టీల్‌ వ్యాపార సంస్థలు, హార్డ్‌వేర్‌ దుకాణాలకు ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఉత్పత్తులు విక్రయించేవారు. తమ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తాజాగా సరికొత్త మార్గాన్ని ఎంపిక చేశారు. ప్రతి ఇంటికీ విశాఖ ఉక్కు ఉత్పత్తులు చేరేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ని అభివృద్ధి చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే సులువుగా, నాణ్యమైన స్టీల్‌ ఉత్పత్తులను డోర్‌ డెలివరీ చేసేందుకు ఈ పోర్టల్‌ని అందుబాటులోకి తెచ్చారు.

విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తయ్యే ప్రతి వస్తువునీ ఆన్‌లైన్‌లో ఈ వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఆర్డర్‌ పెట్టొచ్చు. vizagsteel.com వెబ్‌సైట్‌కి వెళ్లి అందులో ఉన్న ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఈ–సువిధ లింక్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో రిజిస్టర్‌ అయిన తర్వాత వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఏయే తరహా ఉత్పత్తులు అవసరమో వాటిని ఆర్డర్‌లో పేర్కొనాలి. అవి ఎప్పటిలోగా, ఎక్కడికి చేరాలనే వివరాలను కూడా ఇవ్వాలి. డెలివరీ చేయాల్సిన అడ్రస్, ఫోన్‌ నంబర్‌ ఇవ్వడం ద్వారా నిర్దేశిత సమయానికి వైజాగ్‌ స్టీల్‌ ఉత్పత్తులను డోర్‌ డెలివరీ చేసేలా అధికారులు ఈ వ్యవస్థను సిద్ధం చేశారు.

First Published:  15 Jun 2024 7:04 AM GMT
Next Story